Begin typing your search above and press return to search.

విశాల్‌ కు ఆమె ఎలా మద్దతిచ్చిందబ్బా..

By:  Tupaki Desk   |   5 Dec 2017 6:54 AM GMT
విశాల్‌ కు ఆమె ఎలా మద్దతిచ్చిందబ్బా..
X
ఇప్పుడు తమిళనాట ఎక్కడ చూసినా హీరో విశాల్ గురించే చర్చంతా. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ శాసన సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా విశాల్ నామినేషన్ వేయడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. దీని గురించి రాజకీయా నాయకులు.. ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. కొందరు విశాల్ ను హీరోగా అభివర్ణిస్తూ అతడిపై ప్రశంసలు కురిపిస్తుంటే.. కొందరు అతడిని విమర్శిస్తున్నారు. విశాల్ కు మద్దతిచ్చే విషయంలో సినీ పరిశ్రమ రెండుగా చీలిపోయినట్లుగా చెబుతున్నారు. ఇక రాజకీయ పార్టీలు విశాల్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. విశాల్ తో అందరికీ ముప్పే కాబట్టి.. అన్ని పార్టీలు అతడిపై విమర్శల దాడి మొదలుపెట్టొచ్చని భావిస్తున్నారు.

ఐతే ఆశ్చర్యకరంగా మాజీ నటి.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఖుష్బూ సుందర్ విశాల్ కు మద్దతు ప్రకటించింది. విశాల్ ఏంటో తనకు తెలుసని.. అతను మార్పు తేగలడని.. అంటూ అతడికి ఆల్ ద బెస్ట్ చెప్పింది ఖుష్బు. ఓ పెద్ద పార్టీకి అధికార ప్రతినిధి అయి ఉండి.. ఇలా విశాల్ కు ఆమె మద్దతు ప్రకటించడం కాంగ్రెస్ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఇండస్ట్రీ నుంచి దర్శక నిర్మాత చేరన్.. విశాల్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ప్రెస్ మీట్ పెట్టగా.. మరోవైపు కమల్ హాసన్ తెర వెనుక నుంచి విశాల్ కు మద్దతు ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు ఆర్కే నగర్ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న తెలుగు సంఘాలు విశాల్ కు మద్దతిచ్చే విషయంలో ఆలోచిస్తున్నాయి. అన్నాడీఎంకే అభ్యర్థిగా ఉన్న మధుసూదన్ కూడా తెలుగువాడే కావడంతో అతడికి మద్దతివ్వాలా లేక.. తెలుగువాడే అయిన విశాల్ ను సపోర్ట్ చేయాలా అన్నది చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలుగు సంఘాల ప్రతినిధులు అంటున్నారు. ఆర్కే నగర్ నియోజకవర్గంలో లక్షమంది తెలుగు ఓటర్లుండటం విశేషం. వాళ్లే ఫలితాల్ని నిర్ణయిస్తారని భావిస్తున్నారు.