Begin typing your search above and press return to search.

బాబు ఆప్తుడి ఆగ్ర‌హం..జైట్లీకి పొగ‌రు...అహంకారం

By:  Tupaki Desk   |   7 March 2018 5:25 PM GMT
బాబు ఆప్తుడి ఆగ్ర‌హం..జైట్లీకి పొగ‌రు...అహంకారం
X
ప్రత్యేక హోదాకి... ప్రత్యేక ప్యాకేజీకి పెద్దగా తేడాలేదని...ఏపీకి ఇప్పుడు హోదా కేటాయించే చాన్సే లేద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స‌న్నిహితుడు అయిన‌ అరుణ్ జైట్లీ ప్ర‌క‌ట‌న చేయ‌డం ఏపీ రాజ‌కీయాల‌ను హీటెక్కించింది. రాజకీయ ఆందోళనలు - సెంటిమెంట్ల వల్ల నిధులు పెరిగే అవకాశం ఉండదని అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యల నేప‌థ్యంలో తెలుగుదేశం వ‌ర్గాలు ఒకింత షాక్‌కు గుర‌య్యాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. జైట్లీ ప్ర‌క‌ట‌న వెంట‌నే సీఎం చంద్ర‌బాబు త‌న‌ ఛాంబర్‌ లో మంత్రులతో హుటాహుటిన భేటీ అవ‌డం ఇందుకు నిద‌ర్శ‌న‌మంటున్నారు. మ‌రోవైపు బాబు ఆప్తుడిగా పేరున్న ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు కేంద్ర ఆర్థిక‌మంత్రి తీరుపై మండిప‌డ్డారు. ప్రెస్‌ మీట్ లో జైట్లీ చాలా అహంకారంతో మాట్లాడారని దుయ్య‌బ‌ట్టారు.

కేంద్ర ఆర్థిక మంత్రి విలేక‌రుల స‌మావేశం అనంత‌రం ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మీడియాతో మాట్లాడుతూ జైట్లీ ప్రెస్ మీట్ చాలా అభ్యంతరకరంగా ఉందని అన్నారు. ఆ విధంగా మాట్లాడటం అహంకార‌పూరిత విధాన‌మ‌ని వ్యాఖ్యానించారు. సంకీర్ణ ప్రభుత్వాలను నడపడం ఇలా కాదని అన్నారు. కేంద్రం ఏమీ చక్రవర్తి కాదనీ, రాష్ట్రాలు సామంత రాజులు కాదని అన్నారు. నిధులు - కేటాయింపులన్నవి ఏ విధంగా తీసుకుంటుందో తేల్చుకోవలసింది రాష్ట్రమే అని ఈ రోజు ఆయన అనడం బాధ్యతా రాహిత్యమని కుటుంబరావు విమర్శించారు. నిజంగానే కేంద్రం నిధులు ఇవ్వాలనుకుంటే గ్రాంటుగా ఇచ్చేయవచ్చు కదా అలా చేయలేదు అని కుటుంబరావు అన్నారు. ఒక రాజకీయ ఆందోళనలు, సెంటిమెంట్ల ద్వారా నిధులు రావంటూ జైట్లీ చేసిన వ్యాఖ్యలు మిత్ర‌ద‌ర్మాన్ని గౌర‌వించేలా లేవ‌ని ఆయ‌న అన్నారు.

ఇదిలాఉండ‌గా...పార్టీ నేత‌ల‌తో సీఎం చంద్ర‌బాబు అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ తీవ్ర అసంతృప్తి కలిగించిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నట్లు స‌మాచారం. ఆయన ప్రకటన అంతా అసత్యాల పుట్ట అని, పాత పాటే పాడారని విమర్శించారు. మిత్రపక్షాన్ని హేళన చేసేదిగానూ - రాష్ట్ర ప్రజలను అవమానించే విధంగా ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో బీజేపీ- తెలుగుదేశం పార్టీల మధ్య దోస్తీ ఇక కటీఫే అన్న భావన తెలుగుదేశం నాయకులు - ఎమ్మెల్యేలు - ఎంపీలలో వ్యక్తమ‌వుతోంది.