Begin typing your search above and press return to search.

జగన్ మళ్లీ సీఎం అవుతారా? అని అడిగితే కేవీపీ ఏం చెప్పారంటే?

By:  Tupaki Desk   |   23 Aug 2021 10:53 AM GMT
జగన్ మళ్లీ సీఎం అవుతారా? అని అడిగితే కేవీపీ ఏం చెప్పారంటే?
X
దివంగత మహానేత వైఎస్ ఆత్మగా అభివర్ణించే కేవీపీ రామచంద్రరావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. వైఎస్ హయాంలో కేవీపీ ఎంత కీలకభూమిక పోషించారో తెలిసిందే. వైఎస్ కు ప్రధాన సలహాదారు పాత్రను పోషించిన ఆయన.. అన్నీ తానై వ్యవహరించినా.. నోరు విప్పి మాట్లాడేవారు కాదు. మౌనంగానే అన్ని పనుల్ని చక్కబెట్టేవారు. రాజకీయ విమర్శల్ని సైతం మిగిలిన రాజకీయ నేతలకు భిన్నంగా స్పందించేవారు. ఇప్పటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే రాజకీయ పరిణామాల వెనుక.. పార్టీలకు అతీతంగా కొందరు నేతలకు సలహాలు ఇస్తారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.

వైఎస్ హయాంలో చోటు చేసుకున్న అంశాలతో పాటు.. సీఎం జగన్ తో తనకున్న రిలేషన్ గురించి ఆయన సమాధానం ఇచ్చారు. అంతేకాదు.. జగన్ కు పాలనా పరమైన సలహాలు ఇచ్చారు. జగన్ కు ప్రజాబలం గురించి మాట్లాడిన కేవీపీ.. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో జగన్ కు మద్దతుగా కాంగ్రెస్ - టీడీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలతో ఉప ఎన్నికలు జరిగితే రెండు మినహా అన్ని స్థానాలు జగన్ గెలిచారు. కడపలో ఆయనకున్న బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామచంద్రాపురం.. నర్సాపురం మినహా అన్నింటా జగన్ పార్టీ గెలిచారు. నెల్లూరు లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున సుబ్బిరామిరెడ్డిని బరిలోకి దింపితే.. జగన్ తన అభ్యర్థిగా మేకపాటిని దింపి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ డిపాజిటివ్ కోల్పోయింది’’ అంటూ పాత విషయాల్ని గుర్తు చేసుకున్నారు.

జగన్ తాను ఒకే పార్టీలో ఉన్నంత వరకు కష్టనష్టాల్ని.. సమస్యల్ని షేర్ చేసుకునే వాళ్లమని.. పార్టీ నుంచి వేరు పడినతర్వాత తమ మధ్య వ్యక్తిగత సంబంధాలు అలానే ఉన్నా.. అప్పటిలా సమస్యల్ని పంచుకునే విధానం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జగన్ ఎదుర్కొంటునన విమర్శల్నే గతంలోనూ వైఎస్ ఎదుర్కొనేవారని.. జగన్ వయసు ఉన్నప్పుడు వైఎస్ కు ఇలాంటి సమస్యే ఎదురయ్యేదన్నారు. పాదయాత్ర తరువాత ఆయనలో పూర్తిగా మార్పు వచ్చిందన్నారు.

మంత్రివర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాల్ని తీసుకోవాల్సిన సమయంలో సీనియర్ మంత్రులు.. సలహాదారులతో సమస్యలపై చర్చించి వైఎస్ నిర్ణయం తీసుకునేవారన్నారు. రోశయ్య లాంటి సీనియర్ల సలహాల్ని వైఎస్ తీసుకునే వారన్న విషయాన్ని కేవీపీ గుర్తు చేశారు. తద్వారా జగన్ చేయాల్సిందేమిటన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారని చెప్పాలి.సమస్యల పరిష్కారానికి ముందు చర్చలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ ఎవరి మాట వినరన్న ఆరోపణ.. ఎవరి సలహాలు స్వీకరించే విమర్శలపైనా స్పందించేందుకు కేవీపీ ఇష్టపడలేదు. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాట వేశారు. 2024లో జరిగే ఎన్నికల్లో ఆయన తిరిగి అధికారంలోకి వస్తారా? అన్న ప్రశ్నకు సూటి సమాధానం చెప్పని కేవీపీ.. జగన్ కున్న బలం గురించి ప్రస్తావించారు.

మరోసారి ఇదే ప్రశ్నను సంధించినప్పుడు మాత్రం ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల కాలం ఉందని.. అప్పుడు జరిగే దాని గురించి ఇప్పుడే చెప్పటానికి తానేమైనా జ్యోతిష్యుడిని కాదని ఆయన అన్నారు. మంత్రులందరిని తీసి వేసి.. అంతా కొత్త వారితో కాబినెట్ ను సిద్ధం చేసుకుంటారన్న ప్రశ్నకు బదులిచ్చిన కేవీపీ.. గతంలోనే జగన్ ఈ విషయాన్ని చెప్పారని.. మంత్రివర్గంలో 90 శాతం మందిని తొలగిస్తానని చెప్పిన వైనాన్ని గుర్తు చేశారు. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనతో తనకు నేరుగా సంబంధాలు లేవన్నారు.

కామన్ ఫ్రెండ్స్ ద్వారా.. మిత్రుల ద్వారా.. సన్నిహితుల ద్వారా తెలిసిన విషయాల మీదనే తానుస్పందిస్తున్నానని చెప్పారు. పాలనాపరంగా బాగా అనుభవం ఉన్న వారితో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోవాలన్న మాట కేవీపీ మాటల్లో బలంగా వినిపించటం గమనార్హం. జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాల వెనుక ప్రశాంత్ కిశోర్ ఉన్నారని.. రెండు తెలుగు రాష్ట్రాల మీదా రాహుల్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేశారు. అట్టే ఇంటర్వ్యూలు ఇవ్వని కేవీపీ.. తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.