Begin typing your search above and press return to search.

కేవీపీ బిల్లుకు శుక్రవారానికి లింకేంటి?

By:  Tupaki Desk   |   26 July 2016 5:30 PM GMT
కేవీపీ బిల్లుకు శుక్రవారానికి లింకేంటి?
X
మొన్న శుక్రవారం ఏపీ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అంశాలు రెండున్నాయి. ఇందులో ఒకటి ఏపీకి ప్రత్యేశ హోదా అంశంపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు కాగా.. రెండోది కబాలి. రజనీకాంత్ చిత్ర ఫలితం ఆ రోజే తేలిపోగా..కేవీపీ ప్రైవేటు బిల్లుపై ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. నిజానికి శుక్రవారం నాటికి వరుస క్రమంలో ఒకటో నెంబరుగా ఉన్న కేవీపీ బిల్లు తర్వాత ఎక్కడో అడుగుకు వెళ్లిపోయింది. ఈ విషయంలో బీజేపీ తొండి ఆట ఆడిందంటూ పలువురు విమర్శించటం మర్చిపోకూడదు.

వరుస క్రమంలో వెనక్కి పడిన కేవీపీ ప్రైవేటు బిల్లును చర్చకు వచ్చే అవకాశంలేకుండా కమలనాథులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ వీడియో ఉదంతాన్ని తెలివిగా తెర మీదకు తీసుకొచ్చిన బీజేపీ రాజ్యసభ సభ్యులు.. కేవీపీ బిల్లుపై చర్చకు వచ్చే అవకాశం లేకుండా చేశారు.ఆమ్ ఆద్మీ ఎంపీ పై చర్యలు తీసుకోవాలంటూ వారు చేసిన ఆందోళనలతో సభవాయిదా పడింది. ఇలాంటి పరిణామాలు చూసిన చాలామంది శుక్రవారం చర్చకు రాకపోతే.. తర్వాతి రోజు చర్చకు వస్తుందని భావించారు.

కానీ.. అలా వచ్చే ఛాన్స్ లేదన్న విషయం పలువురు చెబుతుంటే.. ఎందుకిలా?అన్న సందేహం పలువురికి కలుగుతోంది. ఎందుకిలా అనే విషయంలోకి వెళితే..ఒక నిబంధన చర్చకు రాకుండా చేస్తుందని చెప్పాలి. ప్రత్యేక హోదా అంశంపై కేవీపీ ప్రవేశపెట్టింది ప్రైవేటు బిల్లు కావటం.. నిబంధనల ప్రకారం ఈ తరహా బిల్లుల్ని కేవలం శుక్రవారం మాత్రమే సభలో చర్చించే అవకాశం ఉండటంతో వెంటనే చర్చకు తేలేని పరిస్థితి.

అంటే.. సభ జరిగే కాలంలో ఈ బిల్లును చర్చకు తేవాలంటే శుక్రవారాల్లోనే తేవాలన్న మాట. ఇందుకే.. ఈ బిల్లుపై వెంటనే చర్చ జరగాలంటే కాంగ్రెస్ నేతలు పట్టబుడుతున్నా.. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ససేమిరా అంటూ నిబంధనల్ని గుర్తు చేస్తున్నారు. సో.. కేవీపీ బిల్లు చర్చకు రావాలంటే అయితే శుక్రవారం లేదంటే.. ఇక ఈ సమావేశాల్లో కుదరనట్లేనని చెప్పకతప్పదు.