Begin typing your search above and press return to search.

అవును.. ఆయన ఏపీ పిచ్చోడే..

By:  Tupaki Desk   |   5 Feb 2018 7:44 PM GMT
అవును.. ఆయన ఏపీ పిచ్చోడే..
X
రాష్ర్ట విభజన నాటి నుంచి ఇప్పుడు కేంద్రం మొండిచెయ్యి చూపించడం వరకు అడుగడుగునా ఏపీకి జరుగుతున్న అన్యాయంపై మడమ తిప్పకుండా పోరాడుతున్నది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానంగా ఒకే ఒక్కడి పేరు చెప్పగలం. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కూడా చిత్తశుద్ధితో పోరాటం చేస్తూ చివరికి పిచ్చోడన్న ముద్ర వేయించుకున్న ఒకే ఒక్కడు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. అవును... ఏపీ సమస్యలు - విభజన హామీలపై నేతల వైఖరిని గమనిస్తే ఒక్క కేవీపీ తప్ప ఇంకెవరూ పార్లమెంటులో ఆ స్థాయిలో సీరియస్‌ గా లేని విషయం అర్థమవుతుంది.

తాజాగా టీడీపీ - బీజేపీ మధ్య బడ్జెట్ నేపథ్యంలో గ్యాప్ వచ్చిన తరువాత టీడీపీ ఎంపీలు పార్లమెంటు వద్ద నిరసన తెలపడాన్ని చూసినా.. రాజ్ నాథ్ సింగ్ తో భేటీ సందర్భంగా వారి తీరు చూసినా ఎక్కడా సీరియస్ నెస్ కానీ - నిర్మాణాత్మక వైఖరి కానీ కనిపించదు. పార్లమెంటు వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతున్న సందర్భంలో కలిసికట్టుగా నినదించలేకపోయారు కూడా. ఒక్కొక్కరిది ఒక్కో నినాదం.. కొందరు నినాదాలు చేస్తుంటే మరికొందరు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇక రాజ్ నాథ్ తో భేటీ సందర్బంగానూ అంతే. ఏదో సరదాగా మాట్లాడుకున్నట్లే ఉంది తప్ప అసంతృప్తిని గట్టిగా వ్యక్తపరిచింది లేదు.

కానీ, అదే సమయంలో రాజ్యసభలో కేవీపీ నిరసన తెలిపిన తీరు మొదటి నుంచీ ప్రత్యేకమే. విభజన సమయంలో విభజన వద్దంటూ ఆయన ప్లకార్డు పట్టుకుని రోజంతా నిల్చుకున్నారు. ఇప్పుడు బడ్జెట్ తరువాత కూడా రోజంతా ప్లకార్డు పట్టుకుని వెల్ లో నిల్చుని నిరసన తెలిపారు. దాంతో... రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఆయన్ను నీకేమైనా పిచ్చా అని కూడా అన్నారు.

కేవీపీ సందర్భం వచ్చిన ప్రతిసారీ ప్రత్యేకహోదా - ఇతర విభజన హామీలపై సభలో గట్టిగా మాట్లాడుతున్నారు. పలుమార్లు ప్రయివేటు మెంబరు బిల్లులు కూడా పెట్టారు. ప్రతి సందర్భంలోనూ ఆయన హావభావాల్లో - కళ్లలో సీరియస్ నెస్ - ఏపీపై ప్రేమ కనిపిస్తుంటాయి. తన సొంత పార్టీ కాంగ్రెస్ చేసిన ఈ విభజనను అడ్డుకోలేకపోయామే అన్న వేదనా ఆయనలో కనిపిస్తుంది. అందుకేనేమో... పిచ్చోడని ముద్ర వేసినా కూడా ఆయన ఏఫీ కోసం అంతగా పరితపిస్తున్నారు. అప్పుడప్పుడు నాలుగు నిధులు విదుల్చుతున్న కేంద్రం కానీ.. దానికోసం కొట్లాడుతున్నట్లుగా హడావుడి చేసే చంద్రబాబు అండ్ కో కానీ ఏపీ హీరోలు కారు.. కేవీపీ మాత్రమే ఏపీ హీరో అని చెప్పుకోవాలి.