Begin typing your search above and press return to search.

ప్యాకేజీ లోగుట్టును కేవీపీ విప్పేశారుగా!

By:  Tupaki Desk   |   27 Jan 2017 9:50 AM GMT
ప్యాకేజీ లోగుట్టును కేవీపీ విప్పేశారుగా!
X
ఏపీ ప్ర‌జ‌లంతా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాల‌ని డిమాండ్ చేస్తుంటే... వారి మ‌నోభావాల‌ను గౌర‌వించడ‌మే కాకుండా, వారి ఆశ‌ల మేర‌కు కేంద్రం నుంచి ప్ర‌త్యేక హోదాను సాధించాల్సిన బాధ్య‌త ముఖ్య‌మంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడుపై ఉంద‌న్న‌ది ఏ ఒక్క‌రు కూడా కాద‌న‌లేని స‌త్యం. మ‌రి ప్ర‌త్యేక హోదాను కాకుండా ప్ర‌త్యేక ప్యాకేజీ ఇచ్చిన కేంద్రంపై పోరు సాగించ‌కుండా... మోదీ స‌ర్కారును చంద్ర‌బాబు ఎందుకు మోస్తున్న‌ట్లు? ఈ విష‌యం వెనుక ఉన్న అస‌లు కార‌ణ‌మిదేనంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత‌ - రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ రామ‌చంద్రారావు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. నేటి ఉద‌యం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడిన ఆయ‌న చంద్ర‌బాబు వైఖ‌రిపై నిప్పులు చెరిగారు.

రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని నాడు ప్ర‌ధాని హోదాలో మ‌న్మోహ‌న్ సింగ్ పార్ల‌మెంటు సాక్షిగా ప్ర‌క‌టించారు. అయితే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఐదేళ్లు స‌రిపోదు... ప‌దేళ్లు కావాలంటూ నాడు విప‌క్ష ఎంపీగా ఉన్న ప్ర‌స్తుత కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు గొంతెత్తిన విష‌యాన్ని కూడా ఏ ఆంధ్రుడూ మ‌రిచిపోని విష‌యం. మ‌రి నాటి ప్ర‌భుత్వం పార్ల‌మెంటులో చేసిన ప్ర‌క‌ట‌న‌ను అమ‌లు చేయాల్సిన బాధ్య‌త నేటి ప్ర‌భుత్వంపై లేదా? ఎందుకు లేదూ... త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు చేయాల్సిందే. అయితే ఆ హామీ అమ‌లు కాకుండా అడ్డుప‌డుతున్న‌ది వేరెవ‌రో కాదు... సాక్షాత్తు చంద్ర‌బాబేన‌న్న‌ది కేవీపీ వాద‌న‌.

అస‌లు కేవీపీ వాద‌నలోకి వెళితే... జాతీయ ప్రాజెక్టుగా చాలా కాలం క్రిత‌మే హోదా ల‌భించిన పోల‌వ‌రం ప్రాజెక్టుకు ఖ‌ర్చ‌య్యే నిధుల‌న్నింటినీ తానే స‌మ‌కూరుస్తానంటూ కేంద్రం ప్ర‌క‌టించింది. ఇది కూడా ప్ర‌త్యేక హోదాకు బ‌దులుగా ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించిన సంద‌ర్భంగా వెలువ‌డ్డ కీల‌క ప్ర‌క‌ట‌న. మ‌రి పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను ఎవ‌రు చేస్తున్నారు? న‌ర‌స‌రావుపేట ఎంపీగా ఉన్న టీడీపీ నేత రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కుటుంబ స‌భ్యుల‌కు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌. బిల్లులు అందిన‌ప్పుడు మాత్రం ప‌నుల‌ను చ‌క‌చ‌కా చేస్తున్న ట్రాన్స్‌ ట్రాయ్‌... ఏమాత్రం బిల్లుల మంజూరు ఆల‌స్యం అయినా ప‌నుల‌నున అట‌కెక్కిస్తోంది.

ఈ క్ర‌మంలో స‌ద‌రు ప‌నుల నుంచి స‌ద‌రు కంపెనీని తొల‌గించాల్సిన ఏపీ స‌ర్కారు... మొద్దు నిద్ర‌లో జోగుతూ... కావాల‌నే ట్రాన్స్‌ ట్రాయ్‌ పై చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ట‌. అంతేకాదండోయ్‌... చంద్ర‌బాబుకు ట్రాన్స్‌ ట్రాయ్‌ తో ప్ర‌త్య‌క్ష అనుబంధం కూడా ఉంద‌ట‌. ఈ కార‌ణంగానే ఆ కంపెనీకి ప‌నులు క‌ట్ట‌బెట్టే విష‌యంలో చంద్ర‌బాబు స‌ర్కారు నిబంధ‌న‌ల‌కు నీళ్లొదిలేసింద‌ట‌. టెండ‌ర్ల ప్ర‌క్రియ‌లో ఎలాంటి పార‌ద‌ర్శ‌క‌త పాటించ‌కుండా... పోల‌వ‌రం ప‌నులు ట్రాన్స్‌ ట్రాయ్‌ కి ద‌క్కేలా చంద్ర‌బాబు స‌ర్కారు వ్య‌వ‌హ‌రించింద‌ని కేవీపీ ఆరోపించారు. మ‌రి ఈ ఆరోప‌ణ‌ల‌పై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/