Begin typing your search above and press return to search.
ఆర్కే బీచ్ వెనుక కేవీపీ ఉన్నాడట
By: Tupaki Desk | 26 Jan 2017 8:51 AM GMTఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన ఆర్కే బీచ్ ఆందోళన వెనుక కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు ఉన్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీనియర్ రాజకీయవేత్త కేవీపీ మొదట ప్రతిపాదన పెట్టడం కారణం. కేవీపీ ఇటీవలే సీఎం చంద్రబాబుకే లేక రాసిన సంగతి తెలిసిందే. తమిళనాడు ప్రజలు తమ సాంప్రదాయమైన జల్లికట్టు ఆటపై నిషేధం ఎత్తివేయాలని కేంద్రంపై పోరాడి దానిని సాధించుకొన్న నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ ఈ విషయంలో మిగతా రాజకీయ నాయకుల కంటే ముందే స్పందించిన కేవీపీ ఏకంగా జల్లికట్టు తరహా ఉద్యమ స్పూర్తితో ప్రత్యేక హోదా కోసం పోరాడుదాం రండి అని సీఎం చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు.
కేవీపీ లేఖ రాయడంతో రాజకీయ వర్గాల్లోనూ కదలిక వచ్చి ఏపీలో జల్లికట్టు ఉద్యమం స్పూర్తిగా ప్రత్యేక హోదా పోరాటం చేపట్టాలనే ప్రతిపాదనకు పెద్దఎత్తున్న స్పందన వచ్చిందని కొందరు అంటున్నారు. ప్రత్యేక హోదాకోసం ఏపీ యువత జల్లికట్టు తరహా పోరుకు నడుంబిగించారని చెప్తున్నారు. రాష్ట్రంలో ఏపీకి ప్రత్యేకహోదా అంశం ఎప్పుడు తెరమరుగైనా అప్పుడే కేవీపీ తన ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఈ అంశానికి జీవం పోస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీయే మార్గమని కేంద్రం చెప్పడం, రాష్ట్ర సర్కార్ మౌనం దాల్చిన పరిస్థితుల్లో, ఇతర ప్రతిపక్షాలు సైతం ఆ అంశాన్ని గాలికొద్దిలేసిన సందర్భలో రాజ్యసభలో ప్రత్యేక హోదాపై కేవీపీ రామచంద్రరావు ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టి దానిపై ప్రత్యేక చర్చ పార్లమెంటులో సాగేలా చేశారు. ఆ చర్చ నాడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చాంశనీయమైంది. ఏపీకి ప్రత్యేక హోదాకు జాతీయ పార్టీ నేతల మద్దతు సైతం నాడు దక్కింది. ఇదంతా నాడు కేవీపీ రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లు పుణ్యమేనని రాజకీయ వర్గాలు సైతం ఆయన వైఖరిని ప్రశంసించాయి.
కేవీపీ పెట్టిన ఈ బిల్లు వల్ల నాడు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు దీనిపై మాట్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ ఏపీకి ప్రత్యేక హోదా లేదు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీయే మార్గం అని కేంద్రం చెప్పడం, ఇదే సరైంది అని ఏపీ సర్కార్ స్వాగతించడం జరిగింది. ప్రత్యేక హోదాపై ఆ తరువాత అన్ని పార్టీలు పోరాడుతున్నా అనుకొన్న మేర ఆ అంశాన్ని సెంటిమెంటుగా మార్చలేకపోయాయి. కానీ తమిళనాడులో జరిగిన జల్లికట్టు ఉద్యమం అది విజయవంతం కావడంతో సమయానుసారం జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ప్రత్యేక హోదా కోసం పోరాడుదాం రండి అని కేవీపీ ఇచ్చిన పిలుపుతో మళ్లీ రాష్ట్రంలో హోదా పోరు ఉధృతం కావడానికి బీజం వేసిందని చెప్పవచ్చని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/