Begin typing your search above and press return to search.

జైట్లీని ధర్మసంకటంలో పడేసిన కేవీపీ?

By:  Tupaki Desk   |   20 July 2016 12:37 PM GMT
జైట్లీని ధర్మసంకటంలో పడేసిన కేవీపీ?
X
తెగించినోడు దేన్ని లెక్క చేయలేడని అంటుంటారు. అందుకు తగ్గట్లే ఉంది కేంద్రంలోని మోడీ సర్కారు. సార్వత్రిక ఎన్నికల ముందు.. విభజన బిల్లు రాజ్యసభకు వచ్చిన సందర్భంగా తమ పార్టీ నేతలు చెప్పిన మాటల్ని మోడీ తూచ్ అనేయాలని చెప్పటం.. అందుకు తగ్గట్లే ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని లైట్ తీసుకోవటం తెలిసిందే. విభజన బిల్లు రాజ్యసభకు వచ్చిన సందర్భంగా నాడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఐదేళ్లు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనున్నట్లు హామీ ఇస్తే.. దానికి ప్రతిగా బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు కల్పించుకొని.. తాము త్వరలో అధికారంలోకి రానున్నామని ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటామని బడాయి హామీ ఇవ్వటం తెలిసిందే.

అయితే.. మోడీ ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత మొత్తం సీన్ మారిపోయింది. కేంద్రంలో బలమైన అధికారపక్షంగా అవతరించటం.. పూర్తిస్థాయి మెజార్టీ సొంతంగా ఉండటంతో ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాను అటకకెక్కిస్తూ మోడీ బ్యాచ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. కాంగ్రెస్ నేత.. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టటం.. అది కాస్తా శుక్రవారం సభలో చర్చ జరిగి.. ఆ తర్వాత ఓటింగ్ కు వచ్చే అవకాశం ఉండటంతో.. ఆ బిల్లు పాస్ అయ్యేలా చూసేందుకే కేవీపీ రంగంలోకి దిగారు.

బిల్లును వ్యతిరేకించే బీజేపీ దూకుడుకు ముందరకాళ్ల బంధం వేసేలా ఆయన తాజాగా లేఖాస్త్రాన్ని సంధించారు. బిల్లుకు బీజేపీ వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశమే ఎక్కువగా ఉండటంతో.. ఆ పార్టీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీయాలన్న ఆలోచన చేస్తున్న కాంగ్రెస్.. కేవీపీ చేత ఒక లేఖను రాయించింది. దీన్ని ప్రస్తుతం రాజ్యసభకు నాయకుడిగా వ్యవహరిస్తున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి గతాన్ని గుర్తు చేస్తూ లేఖ రాశారు.

ఏపీ పునర్విభజన బిల్లు రాజ్యసభకు వచ్చిన సందర్భంగా నాటి పరిస్థితిని గుర్తు చేయటంతో పాటు.. కాంగ్రెస్.. బీజేపీలు ఏమేం మాటలు చెప్పాయన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. వెంకయ్యనాయుడు మాట్లాడిన మాటలకు సంబంధించిన రికార్డుల్ని తన లేఖకు జత చేయటం గమనార్హం. నాడు రాజ్యసభలో బీజేపీ ఇచ్చిన హామీని నేడు సభా నాయకుడిగా అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ లేఖ రాయటం జైట్లీని ధర్మ సంకటంలో పడేస్తుందని చెప్పాలి. అయితే.. ఇలాంటి వాటిని పట్టించుకునేంత స్థితిలో మోడీ పరివారం ఉందా? అన్నది ప్రశ్న. దానికి సమాధానం కోసం శుక్రవారం వరకూ వెయిట్ చేస్తే అర్థమవుతుందని చెప్పొచ్చు.