Begin typing your search above and press return to search.

కేవీపీ ఇంట్లో రహస్య మంతనాలేంటో?

By:  Tupaki Desk   |   12 May 2016 9:34 AM GMT
కేవీపీ ఇంట్లో రహస్య మంతనాలేంటో?
X
ఏపీ ప్రత్యేక హోదాపై పార్లమెంటులో ప్రయివేటు మెంబరు బిల్లు ప్రవేశపెట్టి కాస్త ఊపు తెచ్చిన కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఏదో పెద్ద రాజకీయ వ్యూహమే రచించినట్లుగా ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. ఢిల్లీలోని కేవీపీ నివాసంలో కాంగ్రెస్ సీనియర్ దిగ్గజాలు సమావేశమై రహస్య మంతనాలు జరపడం అందుకు ఊతమిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వెంటనే ఇవ్వాలని ఆయన రాజ్యసభలో ప్రైవేటు బిల్లును పెట్టడంతో ఆత్మరక్షణలో పడిన బీజేపీ - రాజ్యసభను పదే పది నిమిషాల్లో వాయిదా వేయగా, ఆపై నేతలంతా కేవీపి ఇంట సమావేశమయ్యారు. రేపు రాజ్యసభ సమావేశాలు ముగిసి నిరవధిక వాయిదా పడనుండటంతో, ఈ లోగా అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించనట్టు తెలుస్తోంది. బిల్లుపై ఓటింగ్ జరిగితే ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యే అవకాశాలే అధికం. అదే జరిగితే బీజేపీకి ఇబ్బంది. ఈ నేపథ్యంలోనే రేపు చర్చకు వస్తే ఏం చేయాలన్న విషయమై నేతలంతా రహస్యంగా చర్చించుకున్నట్టు తెలుస్తోంది. విపక్షాలన్నీ కేవీపీ బిల్లుకు మద్దతివ్వగా, అధికారం పక్షంలో భాగంగా ఉన్న తెలుగుదేశం సైతం రెడీ అనక తప్పనిసరి పరిస్థితి నెలకొంది.

కాగా కేవీపీ తాజా రాజకీయ వ్యూహాలు నిజంగా ఏపీ ప్రత్యేక హోదా కోసమా.. లేదంటే బీజేపీని ఇరుకునపెట్టి కాంగ్రెస్ కు మైలేజి తేవడానికి మాత్రమేనా అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి. దారునంగా దెబ్బతిన్న కాంగ్రెస్ లో మంచి మైలేజి తేవడానికి కేవీపీ రచించిన వ్యూహం ఆయనకు కూడా పార్టీలో మంచి మైలేజి తెచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఇది వ్యక్తిగత మైలేజి కోసం కేవీపీ ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ లోనే కొందరు నేతలు అంటున్నారు.