Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కబాలి కేవీపీ..

By:  Tupaki Desk   |   23 July 2016 7:15 AM GMT
కాంగ్రెస్ కబాలి కేవీపీ..
X
కబాలి సినిమా శుక్రవారం(22వ తేదీన) రిలీజ్ అయింది.. దేశమంతా కబాలి పైనే చర్చ. అదే శుక్రవారం కాంగ్రెస్ ఎంపీ కేవీపీ ఏపీ ప్రత్యేక హోదా కోసం పెట్టిన ప్రయివేటు మెంబరు బిల్లు రాజ్యసభకు చర్చకు రావాల్సిన ఉన్నప్పటికీ రాలేదు. కానీ... ఆ బిల్లు - బిల్లును ప్రవేశపెట్టిన కేవీపీ మాత్రం పార్లమెంటులో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. కాంగ్రెస్ కబాలిగా అందరి ప్రశంసలు అందుకున్నారు. మోకాళ్ల నొప్పులతో నడవలేకపోతున్న ముసలి కాంగ్రెస్ కు మంచి మందేసి మళ్లీ చిందేసేలా చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానమే కాదు ప్రతిపక్ష పార్టీలన్నీ కేవీపీని కాంగ్రెస్ కబాలి అంటూ కీర్తిస్తున్నాయి.

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పార్లమెంటులో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. పార్లమెంటు ముందుకు పెద్ద సంఖ్యలో ప్రైవేటు బిల్లులు వస్తున్నా... కేవీపీ ప్రవేశపెట్టిన ‘హోదా’ బిల్లు మాత్రం వాటన్నిటికంటే ప్రత్యేకంగా నిలిచింది. కబాలి సినిమా విషయంలో ఎలాగైతే కొన్ని రోజులుగా దేశవ్యాప్త ఆసక్తి నెలకొందో.. కేవీపీ బిల్లుపైనే కొన్నాళ్లుగా అంతేస్థాయిలో ఆసక్తి - ఉత్కంఠ ఏర్పడ్డాయి. నిన్న రాజ్యసభలో జరిగిన హైడ్రామా నేపథ్యంలో బిల్లుపై ఓటింగ్ మరోమారు వాయిదా పడిపోయింది కానీ ఓటింగే జరిగితే కేవీపీ బిల్లు నెగ్గేదనే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాగా చాలాకాలంగా సరైన ఇష్యూ లేక.. ఇష్యూలు ఉన్నా ఉపయోగించుకోలేక నీరసించిన కాంగ్రెస్ పార్టీకి కేవీపీ బిల్లు సంతోషాన్నిచ్చింది. దీంతో ఒక్క బిల్లుతో పార్లమెంటులో 'సెంటరాఫ్ అట్రాక్షన్'గా నిలిచారంటూ కేవీపీపై సాటి ఎంపీలంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక్క బిల్లుతో ప్రభుత్వాన్ని గడగడలాడించవచ్చని నిరూపించారంటూ కొందరు ఎంపీలు వ్యాఖ్యానించారు. మరికొందరు ఎంపీలు మరో అడుగు ముందుకేసి కేవీపీయే కబాలి అంటున్నారు. వైఎస్ హయాంలో తెర వెనుక మంత్రాంగంలో తల పండిపోయిన కేవీపీ అప్పట్లో కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి అనుమానపు చూపులను ఎదుర్కొన్నా ఇప్పుడు మెల్లమెల్లగా సోనియమ్మకు ప్రీతిపాత్రుడవుతున్నారు.