Begin typing your search above and press return to search.

కేవీపీ ప్ర‌త్యేక హోదా తెస్తారా?

By:  Tupaki Desk   |   22 July 2016 6:52 AM GMT
కేవీపీ ప్ర‌త్యేక హోదా తెస్తారా?
X
ఏపీ ప్ర‌త్యేక హోదా ఇప్పుడు ఢిల్లీలో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ నేత కెవిపి రామచంద్రరావు ఏపికి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ప్రవేశ పెట్టిన ప్రైవేటు సభ్యుడి బిల్లు శుక్రవారం మధ్యాహ్నం తరువాత చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే.. దీనిపై ఓటింగ్ వ‌ర‌కు వెళ్తుందా.. వెళ్తే ఏమ‌వుతుంది.. వెళ్ల‌క‌పోతే ఏమ‌వుతంద‌న్న‌ది స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేపుతోంది.

ఇది చ‌ర్చ‌కు వ‌చ్చిన త‌రువాత స్వల్పకాలిక చర్చ అనంతరం అవసరమైతే ఓటింగ్ జరుగుతుంది. ఏదైనా వివాదం త‌లెత్తి సభలో గందరగోళం రేగితే - దాని వల్ల సభాకార్యక్రమాలు స్తంభించిపోయి సోమవారానికి వాయిదా పడినట్లయితే.. మళ్లీ శుక్రవారం దాకా బిల్లు సభ ముందుకు రాదు. ఒకవేళ చర్చకు చైర్మన్ అవకాశమిచ్చి - బిల్లును ప్రతిపాదించిన సభ్యుడు (కెవిపి) ఓటింగ్‌ కు పట్టుబడితే అప్పుడు కచ్చితంగా ఓటింగ్ జరపక తప్పదు. అదే పరిస్థితి ఏర్పడితే మూజువాణి ఓటుతో రాజ్యసభలో బిల్లు ఆమోదానికి సభానాయకుడు అంగీకరించవచ్చు. కానీ, అంతకంటే ముందు బిల్లును ఉపసంహరించుకోవలసిందిగా సభానాయకుడు అరుణ్‌ జైట్లీ కానీ - పాలక పక్షానికి చెందిన మరో సీనియర్ మంత్రి కానీ సభ్యుణ్ణి కోరతారు.

* బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే అరుణ్‌ జైట్లీకి కెవిపి లేఖ రాశారు. ఆ లేఖలోని అంశాలను ప్రస్తావిస్తూ, వాటికి ప్రభుత్వం తరపున పరిష్కారాలను చూపించే అవకాశం ఉంది. లేదా ఆ అంశాలను పరిశీలించి ప్రభుత్వ విధానాన్ని తెలియజేస్తామని చెప్పవచ్చు.

* ఆ తరువాత బిల్లు ఉపసంహరణకు కెవిపిని ఆయన కోరతారు. అయితే అందుకు కెవిపి అంగీకరించకపోతే ఓటింగ్ తప్పదు. ఈ దశలో మూజువాణి ఓటుతో బిల్లును రాజ్యసభ చైర్మన్ ఆమోదిస్తారు. ఇందుకు తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ సూచ‌న‌ప్రాయంగా తెలిపారు.

* అయితే రాజ్యసభ ఆమోదించినంత మాత్రాన బిల్లు చట్టరూపంలోకి వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదు.

కాగా రాజకీయంగా రచ్చగా మారిన ఈ అంశానికి తెరదించాల‌ని పాల‌క బీజేపీ గ‌ట్టిగా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బిల్లును ప్రవేశపెట్టిన కాంగ్రెస్ నేత కెవిపి - దానికి మద్దతునిస్తున్న తెలుగుదేశం సహా అన్ని పార్టీలకూ తెలుసు. అయినా ఎవరి రాజకీయ లబ్ధికి వారు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కేవీపీ ప్ర‌యివేటు బిల్లు వ‌ల్ల ఏపీకి ప్ర‌త్యేకంగా ఒరిగేదేమీ లేద‌ని తెలుస్తోంది.