Begin typing your search above and press return to search.

బాబు స‌వాళ్ల‌న్నీ...లీకుల వ‌ర‌కే అంటున్న కేవీపీ

By:  Tupaki Desk   |   3 March 2018 10:56 AM GMT
బాబు స‌వాళ్ల‌న్నీ...లీకుల వ‌ర‌కే అంటున్న కేవీపీ
X
పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో - ఏపీ విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం రాష్ర్టానికి ద‌క్కాల్సిన ప్ర‌యోజ‌నాల విష‌యంలో గ‌త కొద్దికాలంగా క్రియాశీలంగా త‌న గ‌ళం వినిపిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత - రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు తాజాగా మ‌రోమారు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. పార్ల‌మెంటు సమావేశాల నేప‌థ్యంలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న పార్టీ ఎంపీల‌తో భేటీ అవ‌డం - ఇత‌ర‌త్రా రాజ‌కీయ ప‌రిణామాల‌పై స్పందించారు. ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టుపెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు ఆగ్రహం అంతా లీకులలోనే ఉంటుందని విమర్శించిన కేవీపీ రాష్ట్రంలో తన ప్రభుత్వంపై ప్రజల్లో కోపం పెరిగిందనే కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు.

పోలవరం విషయంలో 100 శాతం కేంద్రమే నిధులు ఇచ్చేలా చేశామ‌ని అయితే పోలవరం అథారిటీని కాదని 10 శాతం రాష్ట్రం భరించేలా చేసుకొని ప్రాజెక్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పోలవరం ప్రాజెక్టు జీవనాడి అని పేర్కొంటూ అలాంటి ప్రాజెక్ట్ భారం అంతా కేంద్రం భరించేలా బిల్లులో పెట్టామ‌ని కానీ, ఇప్పుడు బీజేపీ - ఏపీ సీఎం చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. పోలవరం వ్యవహారంలో ముఖ్య‌మంత్రి చంద్రబాబును మరోసారి సూటిగా ఎంపీ కేవీపీ ప్రశ్నించారు.`ధరల మార్పుల నివేదిక ఇవ్వకుండా ఎందుకు దాచారు? కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు మాదిరిగా 90 శాతం నిధులు ఇవ్వండి అని ఎందుకు అడిగారు? పునరావాసానికి డబ్బులు కేంద్రం ఇవ్వాలని అడగకుండా విడతలవారిగా చేస్తాం అని ప్రాజెక్ట్ అథార్టీకి ఎందుకు చెప్పారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. త‌న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పోలవరానికి రాష్ట్ర బడ్జెట్ లో స్థానం ఎలా కల్పిస్తారో అర్థం కావటంలేదన్న కేవీపీ ప్రభుత్వంపై తాను చేసి అన్ని ఆరోపణలకు ఆధారాలున్నాయన్నారు. స్వార్ధ ప్రయోజనాల కోసం రాష్ట్రప్రభుత్వం పక్కదారి పడుతోందని ఆరోపించిన కేవీపీ వాళ్ల కమిషన్ కోసమే ఆర్థికబారాన్ని రాష్ట్రంపై అదనపు భారం వేసుకుందని విమర్శించారు. కాంట్రాక్టర్ల విషయంలోనే బీజేపీ, టీడీపీ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని ఆయన ఆరోపించారు. 2015 నుంచి ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ వెల్‌లోనే ఉండి ఆందోళన చేస్తున్నానని కేవీపీ గుర్తు చేశారు. త‌న ఆరోగ్యం సహరించకపోయినా కమిట్‌మెంట్‌తో ఆందోళన చేస్తున్నానని ఆయ‌న వివ‌రించారు. ప్రత్యేక హోదా అని చంద్రబాబు అనటం పచ్చి అవకాశవాదమని ఆయ‌న మండిప‌డ్డారు.