Begin typing your search above and press return to search.

జగన్‌ పై కేవీపీ సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   11 Dec 2022 5:47 AM GMT
జగన్‌ పై కేవీపీ సంచలన వ్యాఖ్యలు!
X
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పై మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా అస్థిరపరచి.. భావితరాల భవిష్యత్తును జగన్‌ నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో పీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో కేవీపీ మీడియాతో మాట్లాడారు.

బంగారు భవిష్యత్‌ కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పాలన చూస్తుంటే ఆవేదన కలుగుతోందని కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఏపీ విభజన హామీల అమలు కోసం జగన్‌ పోరాడడం లేదని హాట్‌ కామెంట్స్‌ చేశారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని జగన్‌ నిలదీయడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రం దశదిశ మారేదన్నారు. ఇప్పుడు దాని దుస్థితి చూస్తుంటే బాధేస్తోంది అని కేవీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ పోలవరాన్ని పట్టించుకోవడం లేదన్నారు.

విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు కేంద్రం సిద్ధపడుతున్నా.. ఆపేందుకు వైఎస్‌ జగన్‌ ప్రయత్నించడం లేదని కేవీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరాన్ని కేంద్రమే నిర్మిస్తుందని చట్టంలో ఉన్నా.. చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ కోసం నిర్మాణ బాధ్యతలు తీసుకోవడాన్ని సైతం కేవీపీ తప్పుబట్టారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడం, రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడం వైఎస్సార్‌ లక్ష్యంగా ఉండేదని తెలిపారు. వీటిని నెరవేర్చడానికి జగన్‌ ప్రయత్నించలేదని మండిపడ్డారు.

బీజేపీకి దగ్గరై జగన్‌ రాష్ట్రాభివృద్ధిని దెబ్బతీస్తున్నారని కేవీపీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ కు భవిష్యత్‌ లేదని బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఒంటరిగా పోరాటం చేస్తూ ప్రజల్లోకి వెళ్తే 2024లో కాకున్నా.. 2029 నాటికైనా కాంగ్రెస్‌ తన పూర్వ వైభవం సాధిస్తుందని వివరించారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డికి, తనకు కాంగ్రెస్‌ రాజకీయ భవిష్యత్‌ ఇచ్చిందని కేవీపీ తెలిపారు. 1978 నుంచి వైఎస్‌కు పార్టీ అనేక పదవులు కట్టబెట్టిందన్నారు. అలాంటి పార్టీని వీడకూడదని, ఏనాడూ అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించకూడదని 1996లోనే వైఎస్‌ రాజశేఖరరెడ్డి, తానూ ఒట్టేసుకున్నామన్నారు. తాను చివరిదాకా కాంగ్రెస్‌ తోనే ఉంటానని కేవీపీ తేల్చిచెప్పారు.

కాగా కేపీపీ రామచంద్రరావుకు వైఎస్సార్‌ ఆత్మగా పేరుంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి వైఎస్‌ హయాంలో తొలిసారి రాజ్యసభ సభ్యుడిగా కేవీపీ ఎన్నికయ్యారు. ఆ తర్వాత మరోమారు ఆయనను రాజ్యసభ ఎంపీగా రెన్యువల్‌ చేశారు.

వైఎస్‌ జగన్‌ కాంగ్రెస్‌ నుంచి విడిపడి కొత్త పార్టీని పెట్టుకున్నా కేవీపీ కాంగ్రెస్‌ లోనే ఉండిపోయారు. కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటూ జగన్‌ కు సాయం చేస్తున్నారని.. ఆయన జగన్‌ కోవర్టు అని అప్పట్లో ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు సైతం చేశారు.

ఇప్పుడు కేవీపీ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా మారాయి. ప్రతిపక్షాలు ఏవైతే జగన్‌ పైన ఆరోపణలు చేస్తున్నాయో అవే విమర్శలను కేవీపీ కూడా చేయడం విశేషం. ఈ నేపథ్యంలో కేవీపీ విమర్శలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల వైఎస్‌ సన్నిహితుడు, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సైతం జగన్‌ పై ఇలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.