Begin typing your search above and press return to search.

యువరాజును ‘వైఎస్’ మాదిరి చేయమన్నాడట

By:  Tupaki Desk   |   25 Oct 2016 4:45 AM GMT
యువరాజును ‘వైఎస్’ మాదిరి చేయమన్నాడట
X
రాజకీయ నేతలంటే ఎలా ఉంటారు? ఏ చిన్న అవకాశం వచ్చినా దూసుకెళ్లిపోతూ.. తమ హవాను ప్రదర్శించేలా ఉంటారు. తమ మాటలతో లక్షలాది మందిని కదిలించే శక్తి వారిలో కనిపిస్తుంది. కానీ.. ఇలాంటివేమీ లేని నేత ఏపీ రాజకీయాల్లో ఒకరు కనిపిస్తారు. తెర వెనుక మంత్రాంగం.. వ్యూహాలు సిద్ధం చేయటం లాంటి వాటితో తానేంటో నిరూపించుకోవటమే కాదు.. కాంగ్రెస్ లాంటి పార్టీలో రాజ్యసభ సీటును చేజిక్కించుకున్న వైనం కేవీపీ రామచంద్రరావుకు మాత్రమే దక్కుతుందేమో. ఆయనకు రాజ్యసభ సీటు రావటానికి దివంగత మహానేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కారణమన్న సంగతి అందరికి తెలిసిందే.

వైఎస్ ఆత్మగా అందరూ అభివర్ణించే కేవీపీ.. 2004లో వైఎస్ తిరుగులేని నేతగా ఆవిర్భవించటానికి.. ఏపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అధినాయకత్వం నిర్ణయం తీసుకోవటం వెనుక కేవీపీ వ్యూహ చతురత ఉందని చెబుతారు. ఏపీ విభజన నేపథ్యంలో రాజ్యసభలో గట్టిగా మాట్లాడటం.. తీవ్రస్థాయిలో నిరసన తెలపటం లాంటివి చేసిన కేవీపీకి.. ఈ తరహా వైఖరి చాలా కొత్తని చెప్పాలి. బ్యాక్ ఎండ్ లో ఉండి వ్యూహాలు పన్నటంలో కేవీపీకి మించిన మొనగాడు మరొకరు ఉండరు. అదే సమయంలో.. మైక్ పట్టుకొని జనాల్లోకి దూసుకెళ్లే తత్వం ఆయనకు ఏ మాత్రం సూట్ కాదు.

ఈ వాస్తవాన్ని గుర్తించే కాబోలు.. వైఎస్ హయాంలో కేవీపీ ఆయన ఆత్మగా వ్యవహరించారే కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరించిన వైనం అస్సలు కనిపించదు. ఏపీ రాష్ట్ర సలహాదారు హోదాలో పని చేసిన కేవీపీ సత్తా ఏమిటో.. ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో.. తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలతో పాటు.. విపక్షనేతలకు సుపరిచితమే. వైఎస్ ఆకస్మిక మరణంతో అత్యంత ఆత్మీయుడ్ని పోగొట్టుకున్న కేవీపీ.. ఒకదశలో రెక్కలు తెగిన పక్షిలా కనిపించారు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవటం మాత్రమే అలవాటున్న ఆయన.. రాజకీయాల్లో నెగ్గుకు రాగలరా? అన్న సందేహం కలిగినా.. అధిష్ఠానానికి తానేంటో నిరూపించుకున్నారనే చెబుతారు. ఈ కారణంతోనే.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలు నెరపటంలో సక్సెస్ అయ్యారని చెబుతారు.

కాంగ్రెస్ కు ఏపీలో బలం అంతంతమాత్రంగా ఉన్న వేళ.. వైఎస్ చేత పాదయాత్రను షురూ చేయించిన అతి కొద్దిమందిలో కేవీపీ ఒకరు. పాదయాత్ర ఫలితాలు ఎలా ఉంటాయో ఆయన స్వయంగా చూసిన వ్యక్తి. పాదయాత్రతో ఏపీలో కాంగ్రెస్ బలమైన బేస్ తయారు చేసుకోవటమేకాదు.. పదేళ్లు అధికారంలో ఉండేలా చేసిందని చెప్పాలి. ఇదేవ్యూహాన్ని తాజాగా ఉత్తరప్రదేశ్ లో అమలు చేయాలని కేవీపీ భావించారు. కాంగ్రెస్ యువరాజు దృష్టికి పాదయాత్ర అంశాన్ని తీసుకెళ్లినట్లు చెబుతారు. వైఎస్ మాదిరి రాహుల్ కానీ.. పాదయాత్రను చేస్తే యూపీలో కాంగ్రెస్ పట్టు విపరీతంగా పెరగటంతో పాటు.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు భారీ మైలేజ్ సొంతం చేసుకునే అవకాశం ఉందన్న వాదనను అధినాయకత్వం ముందు వినిపించినట్లు చెబుతున్నారు. అయితే.. కేవీపీ ఆలోచనను రాహుల్ సానుకూలంగా స్పందించలేదని చెబుతున్నారు. మరోవైపు.. యూపీ ఎన్నికల ప్రచారానికి రావాలంటూ కేవీసీని కాంగ్రెస్ పార్టీ కోరితే.. తనకున్న ఆరోగ్య సమస్యల కారణంగా రాలేనని చెప్పినట్లుగా చెబుతున్నారు. వైఎస్ మాదిరి పాదయాత్రతో యూపీలో మొత్తం సీన్ మార్చేయాలన్న కేవీపీ ఐడియాను ఓకే అనటానికి అక్కడ ఉన్నది యువరాజే కానీ.. వైఎస్ కాదన్న విషయం కేవీపీకి ఇప్పటికి అర్థమై ఉంటుందేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/