Begin typing your search above and press return to search.

వైఎస్‌కు చెప్పాల‌ని నాడు రోశ‌య్య కేవీపీకి చెప్పిందేంటి..!

By:  Tupaki Desk   |   16 Dec 2021 7:10 AM GMT
వైఎస్‌కు చెప్పాల‌ని నాడు రోశ‌య్య కేవీపీకి చెప్పిందేంటి..!
X
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తులు అయిన మరో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఇటీవల మృతి చెందారు. ఆయన మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పలు పార్టీల నాయకులు రోశ‌య్య‌ను రాజకీయాల్లో ఆజాత శత్రువుగా కొనియాడారు.

తాజాగా హైదరాబాద్‌లో రోశ‌య్య‌ వైకుంఠ సమారాధన కార్యక్రమానికి కూడా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పార్టీలతో సంబంధం లేకుండా ఎంతో మంది నాయకులు హాజరై... రోశ‌య్య గొప్పతనం గురించి చెప్పారు. రోశ‌య్య‌ రాజకీయ జీవితాన్ని ఈ తరం రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని కూడా పలువురు ప్రముఖులు సూచించారు.

రోశ‌య్య నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాజకీయాలపై తనదైన ముద్ర వేశారని పలువురు ప్రశంసించారు. ఇదిలా ఉంటే దివంగ‌త వైఎస్ఆర్ ఆప్తుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు కూడా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాల పర్యటనకు వెళుతున్న సమయంలో... ఆర్థిక మంత్రి హోదాలో ఉన్న రోశ‌య్య చెప్పిన మాటలను గుర్తు చేసుకునే వారట.

అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న రోశయ్య రాష్ట్ర బడ్జెట్ లోటులో ఉందని... నిధులు లేవని, కొత్త పథకాలు ప్రకటించ వద్దని ముఖ్యమంత్రి చెవిలో వేయాలని.... కెవిపి రామచందర్ రావుతో చెప్పేవారట.

అయితే వైఎస్‌కు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రకటించాలని మనసులో ఉన్నా... వాటి గురించి రోశ‌య్య‌తో చర్చించిన తర్వాతే ప్రకటించే వారిని కూడా కెవిపి గుర్తుచేసుకున్నారు. అలాగే వైఎస్సార్ చనిపోయినప్పుడు ఆ విషయాన్ని ప్రపంచానికి చెప్పినప్పుడు కూడా రోశయ్య ఎంతో బాధను తనలో దాచుకుని తల్లడిల్లిపోయారు అని చెప్పారు.

వైఎస్ మరణించినప్పుడు కూడా రోశ‌య్య ప‌డిన బాధ, మనోవేదన అంతా ఇంతా కాదని కెవిపి చెప్పారు. అలాగే మాజీ ప్రధానమంత్రి, ప్రముఖ ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్‌ను కూడా ఎన్నో విషయాల్లో సులువుగా ఒప్పించిన వైఎస్ఆర్ .. రోశ‌య్య‌ను మాత్రం అంత త్వరగా ఒప్పించలేకపోయారని కెవిపి నాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు.