Begin typing your search above and press return to search.

రేవంత్ రాజీనామా చేయ‌లేదు: ర‌మ‌ణ‌

By:  Tupaki Desk   |   10 Nov 2017 11:27 AM GMT
రేవంత్ రాజీనామా చేయ‌లేదు: ర‌మ‌ణ‌
X
తెలంగాణ‌లో టీడీపీ కీల‌క‌నేత రేవంత్ రెడ్డి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి, టీడీపీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. టీడీపీ జాతీయాధ్య‌క్షుడు - ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడుకు రాజీనామా ఇచ్చానని రేవంత్ చెప్పారు. స‌మావేశం ముగిసిన త‌ర్వాత మాట్లాడ‌దామ‌ని రేవంత్ కు చెప్పినా వెళ్లిపోయార‌ని చంద్ర‌బాబు అన్నారు. ఈ హైడ్రామా రాజీనామా ఎపిసోడ్ కు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ స‌రికొత్త ట్విస్ట్ ఇచ్చారు. అస‌లు రేవంత్ రాజీనామానే చేయ‌లేద‌ని ర‌మ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజీనామా స‌మ‌ర్పించిన‌ట్లు రేవంత్ అబ‌ద్ధాలు చెబుతున్నార‌ని ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకు రేవంత్‌ రాజీనామా లేఖ ఇచ్చిన మాట అవాస్త‌వ‌మ‌న్నారు. మొద‌టి నుంచి ఎల్ ర‌మ‌ణ‌కు - రేవంత్ కు మ‌ధ్య పొర‌ప‌చ్చాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రి మ‌ధ్య టీటీడీపీలో కోల్డ్ వార్ జ‌రుగుతున్న‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.

ఆ రోజు రేవంత్ కేవ‌లం చంద్ర‌బాబును క‌ల‌వ‌డానికి వ‌చ్చార‌ని - ఆయ‌న‌తో మాట్లాడి దండం పెట్టి వెళ్లిపోయార‌ని ర‌మ‌ణ తెలిపారు.

ఆ లేఖ ఎవరికి ఇచ్చాడో తెలియదని - చంద్రబాబుకు ఇచ్చానని ప్ర‌చారం చేయ‌డం సరికాదని చెప్పారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో మంచి నాయకుడిగా ఎదిగాడ‌ని - ఇపుడు పార్టీ మారి నాయకుడి స్థాయి నుంచి కార్యకర్త స్థాయికి పడిపోయారని ఎద్దేవా చేశారు. ప్ర‌స్తుతం రేవంత్ తాను కాంగ్రెస్‌ లో కార్యకర్తనని చెప్పుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యే పదవీ కాలం ముగిసే సమయంలో రేవంత్ రెడ్డి ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారని రమణ మండిపడ్డారు. ఇటువంటి రేవంత్ లు ఎంత‌మంది వెళ్లినా టీడీపీ కేడర్ చెక్కు చెదరలేదన్నారు. ప్ర‌స్తుతం పాలమూరులో ఎర్ర శేఖర్ అధ్యక్షతన టీడీపీ బలంగా ఉందన్నారు. తెలంగాణలో టీఆర్ ఎస్ కు ఏకైక ప్ర‌త్యామ్నాయం టీడీపీనే అన్నారు.

త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో టీడీపీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో కొడంగల్‌ లో భారీ సభను ఏర్పాటు చేస్తామని - త్వ‌ర‌లో నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశముందని అన్నారు. అయితే, రేవంత్ రెడ్డి బ‌ల‌మైన నాయ‌కుడిగా ఎదుగుతున్నాడ‌న్న అక్క‌సుతోనే ర‌మ‌ణ అత‌డిని టార్గెట్ చేశాడ‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ‌లో నెంబ‌ర్ వ‌న్ స్థానం కోసం ఇద్దరి మ‌ధ్య తీవ్ర‌పోటీ ఉన్న నేప‌థ్యంలో ర‌మ‌ణ వైఖ‌రి వ‌ల్లే రేవంత్ పార్టీ వీడార‌ని వినికిడి. కేసీఆర్ పై ఒంటికాలి మీద లేచే రేవంత్ కు మిగిలిన టీడీపీ నాయ‌కులు, ర‌మ‌ణ నుంచి మ‌ద్ద‌తు క‌రువ‌వ‌డంతోనే ఆత్మాభిమానంతో రేవంత్ పార్టీ వీడిన‌ట్లు తెలుస్తోంది.