Begin typing your search above and press return to search.

ఎల్‌.ర‌మ‌ణ కు ఇంత ఘోర ప‌రాభ‌వం ఏంటి?

By:  Tupaki Desk   |   28 Nov 2018 6:36 AM GMT
ఎల్‌.ర‌మ‌ణ కు ఇంత ఘోర ప‌రాభ‌వం ఏంటి?
X
ఎల్.ర‌మ‌ణ‌ - సౌమ్యుడ‌నే పేరున్న రాజ‌కీయ‌వేత్త‌. తెలంగాణ రాజ‌కీయాల్లో సీనియ‌ర్ బీసీ నేత‌గా పేరుంది. ప్ర‌స్తుతం తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునే నిర్ణ‌యానికి పార్టీ అధిష్టానం మాట‌ ప్ర‌కారం ఆయ‌న ఓకే చెప్పేశారు. ఇంకా చెప్పాలంటే - త‌న సీటును కూడా ఆయ‌న త్యాగం చేసేశారు. అలాంటి ర‌మ‌ణ‌కు తాజాగా టీడీపీ-కాంగ్రెస్ క‌ట్టిన‌ కూట‌మిలో తీవ్రంగా ప‌రాభ‌వం ఎదురైంద‌ని అంటున్నారు.

వివ‌రాల్లోకి వెళితే - కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్‌ గాంధీ రాక నేప‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్ క‌మిటీ ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. దీని సారాంశం రాహుల్ గాంధీకి - టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుకు స్వాగ‌తం ప‌ల‌క‌డం - త‌మ హామీల గురించి తెలియ‌జెప్ప‌డం. ఇందులో టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి - టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ - సీపీఐ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డి - మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ‌ - బీసీ సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణ‌య్య ఫొటోలు స‌హా ప‌లువురు అభ్య‌ర్థుల ఫొటోల‌ను పొందుప‌ర్చింది. అయితే, ఇందులో టీడీపీ ప్రెసిడెంట్ అయిన ఎల్‌.ర‌మ‌ణ ఫోటో లేదు. దీంతో ప‌లువురు నెటిజ‌న్లు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ట్రోల్ చేస్తున్నారు.

పార్టీ కోసం సీటు త్యాగం చేయ‌డ‌మే కాకుండా పోటీకి కూడా దూరంగా ఉన్న సీనియ‌ర్ నేత‌ను ఈ రీతిలో అవ‌మానించ‌డం ఏంట‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు - సీట్ల పంప‌కం ప్ర‌క్రియ‌లో పాల్గొన్న నాయ‌కుడినే ఈ విధంగా ప‌రాభ‌వానికి గురిచేయ‌డం ఆ పార్టీ నేత‌ల తీరుకు నిద‌ర్శ‌న‌మ‌ని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్ర‌బాబే త‌మ ద‌గ్గ‌ర ఉన్న‌పుడు - ఇక ర‌మ‌ణ లెక్కేమిట‌ని బ‌హుశా కాంగ్రెస్ నేత‌లు భావిస్తూ ఉండ‌వ‌చ్చంటున్నారు.