Begin typing your search above and press return to search.

రియ‌ల్ హీరో.. ఈ హైద‌రాబాదీ!

By:  Tupaki Desk   |   11 Dec 2017 5:34 AM GMT
రియ‌ల్ హీరో.. ఈ హైద‌రాబాదీ!
X
తండ్రి రోజు కూలీ రూ.60.. అమ్మ‌కు పోలియో.. ఇలాంటి నేప‌థ్యం ఉన్న చాకులాంటి కుర్రాడి ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయి? ఎంత త్వ‌ర‌గా చ‌దువు పూర్తి చేసి మ‌రెంత మంచి ఉద్యోగం చేయాల‌నుకుంటారు. కానీ.. ఈ హైద‌రాబాదీ అందుకు పూర్తి భిన్నం. ఇంటి ప‌రిస్థితి బాగోలేకున్నా.. త‌న తెలివి.. సామ‌ర్థ్యం అన్ని దేశానికే చెందాల‌ని త‌పించే వ్య‌క్తి. ల‌క్ష‌ల మందిలో ఒక‌రిద్ద‌రు ఇలాంటోళ్లు క‌నిపిస్తార‌ని చెప్పాలి.

డాల‌ర్లు వ‌చ్చి ప‌డేందుకు సిద్ధంగా ఉన్నా.. తాను మాత్రం అలాంటి వాటికి మోజు ప‌డ‌న‌ని స్ప‌ష్టం చేయ‌ట‌మే కాదు.. భారత ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాల‌న్న త‌ప‌న వింటే ఆశ్చ‌ర్యపోవాల్సిందే. దేశభ‌క్తి గురించి.. దేశం కోసం ఏ త్యాగానికైనా రెఢీ అన్న‌ట్లు మాట్లాడే చాలామందికి భిన్న‌మైన బాట‌లో న‌డుస్తున్న‌రు బ‌ర్నాన యాద‌గ‌రి. ఇంత‌కీ అత‌ను ఎవ‌రు? ఏం చేస్తున్నాడు? అన్న విష‌యాల్లోకి వెళితే.

యాద‌గిరి తండ్రి గున్న‌య్య హైద‌రాబాద్‌ లోని ఒక సిమెంటు ఫ్యాక్ట‌రీలో దిన‌స‌రి కూలీగా చేస్తున్నారు. త‌ల్లి పోలియో పేషెంట్‌. ప‌ని చేస్తే కాని రోజు గ‌డ‌వ‌ని దుస్థితి. ఇలాంటి నేప‌థ్యం నుంచి వ‌చ్చిన యాద‌గిరి చ‌దువుల్లో టాప‌ర్ గా సాగారు. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగ‌మించి హైద‌రాబాద్ ట్రిపుల్ ఐటీలో చ‌దివారు. యూఎస్‌ కు చెందిన టాప్ కంపెనీలో భారీ ఆఫ‌ర్ తో ఉద్యోగాన్ని సాధించారు.

క్యాట్ ప‌రీక్ష‌లో 93.4 శాతం స్కోర్ సాధించ‌ట‌మే కాదు.. ఇండోర్ లోని ఐఐఎంలో సీటు సాధించాడు. అయితే.. ఈ ఆఫ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టిన యాద‌గిరి దేశానికి సేవ చేయాలనుకున్నాడు. అందుకే ఆర్మీలో చేరి శిక్ష‌ణ తీసుకున్నాడు. తాజాగా ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మీలో శిక్ష‌ణ పూర్తి చేయ‌ట‌మే కాదు.. టెక్నిక‌ల్ గ్రాడ్యుయేట్ కోర్సులో అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చాడు. ర‌జ‌త ప‌త‌కాన్ని సొంతం చేసుకున్నాడు. దేశానికి సేవ చేసేట‌ప్పుడు పొందే సంతృప్తిని డ‌బ్బు సంపాద‌న‌తో సొంతం చేసుకోలేమ‌న్న మాట‌ను చెబుతున్న యాద‌గిరి ఇప్పుడు ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు. దేశం ప‌ట్ల అస‌లుసిస‌లు క‌మిట్ మెంట్ యాద‌గిరి లంటోళ్ల‌దేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.