Begin typing your search above and press return to search.

భారత క్రికెటర్లకు ఎంత కష్టమొచ్చిందో..

By:  Tupaki Desk   |   17 Jan 2017 9:26 AM GMT
భారత క్రికెటర్లకు ఎంత కష్టమొచ్చిందో..
X
ఇండియన్ క్రికెటర్ల స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. భారత క్రికెట్ జట్టు తరఫున మ్యాచ్ ఆడుతున్నపుడు వాళ్లను ఎలా చూసుకుంటారన్నదీ తెలిసిన విషయమే. వారికి ఏ చిన్న ఇబ్బందీ రాకుండా చూసుకుని.. పూర్తిగా ఆట మీదే దృష్టి పెట్టేలా చూసుకుంటుంది బీసీసీఐ. ఐతే బీసీసీఐలో పాలనా సంస్కరణల కోసం జస్టిస్ లోధా కమిటీ చేసిన ప్రతిపాదనలకు సుప్రీం కోర్టు ఓకే చెప్పడం.. వీటిని తిరస్కరించినందుకు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్.. కార్యదర్శి అజయ్ షిర్కేల మీద వేటు వేయడం.. దెబ్బకు లోధా కమిటీ ప్రతిపాదనల్ని బీసీసీఐతో పాటు అన్ని రాష్ట్రాల క్రికెట్ సంఘాల్లోనూ అమలు చేయడానికి అందరూ ముందుకు రావడం తెలిసిందే.

దీంతో చాలామంది పాత కాపులు.. పవర్ ఫుల్ లీడర్స్ బీసీసీఐని వదిలేసి వెళ్లిపోయారు. బీసీసీఐని నడిపించే కొత్త కార్యవర్గాన్ని సుప్రీం కోర్టే త్వరలో ప్రకటించనుంది. ఐతే బీసీసీఐని నడిపించే వాళ్లెవరూ లేకపోవడంతో భారత క్రికెటర్లకు అనుకోని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పుణెలో ఇంగ్లాండ్ పై తొలి వన్డేలో గెలిచిన అనంతరం సోమవారం భారత్.. ఇంగ్లాండ్ జట్లు రెండూ ఒరిస్సాలోని కటక్ చేరుకోవాల్సింది. కానీ అక్కడ హోటల్ గదులు అందుబాటులో లేవన్న కారణంతో పుణెలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

భారత్.. ఇంగ్లాండ్ జట్లు బస చేయాల్సిన హోటళ్లలో గదులన్నీ ఎవరో పెళ్లి కోసం బుక్ చేసుకున్నారట. బుధవారం ఉదయం వరకు వాళ్లు ఖాళీ చేయరట. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు పుణెలోనే ఉండిపోవాల్సి వచ్చింది. గురువారం రెండో వన్డే జరగబోతుంటే ముందు రోజు మాత్రమే అక్కడికి చేరుకోనున్నారు. అదే గనుక అనురాగ్ ఠాకూర్ అండ్ కో బీసీసీఐలో కొనసాగుతూ ఉండి ఉంటే.. ఆ హోటల్ మొత్తాన్ని ఖాళీ చేయించి క్రికెటర్ల కోసం కేటాయించి ఉండేవారనడంలో సందేహం లేదు. ఒరిస్సా క్రికెట్ సంఘంలోనూ పవర్ ఫుల్ వ్యక్తులు సంఘం నుంచి నిష్క్రమించారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ వ్యవస్థ మొత్తం ప్రస్తుతం నాయకత్వ లేమితో ఇబ్బంది పడుతోంది. ఆ ప్రభావం క్రికెటర్ల మీదా పడుతోంది. సాధ్యమైనంత త్వరగా వ్యవస్థ చక్కబడకుంటే.. మున్ముందు మరిన్ని ఇబ్బందులు తప్పవేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/