Begin typing your search above and press return to search.

రాజు గారికి ఇంటా బయటా ఆడోళ్లే ప్రత్యర్థులా

By:  Tupaki Desk   |   11 Dec 2020 9:13 AM GMT
రాజు గారికి ఇంటా బయటా ఆడోళ్లే ప్రత్యర్థులా
X
విజయనగరం జిల్లాలో రంజైన రాజకీయం మొదలైంది. ఇంతకాలం పార్టీకి పెద్ద దిక్కుగా ప్రచారంలో ఉన్న అశోక్ గజపతిరాజును ఇద్దరు ఆడవాళ్ళు చెరోవైపు చేరి వాయించేస్తున్నారు. బాబాయ్ అశోక్ తో సోదరుని కూతురు, మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ సంచైతా గజపతిరాజుకు పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన రెండు మాటలంటే ఈమె నాలుగు అంటించేస్తోంది. ఇటువంటి సమయంలోనే రాజుగారికి మాజీ ఎంఎల్ఏ మీసాల గీత కూడా సవాలు విసిరారు.

విజయనగరంలో మరో సీనియర్ నేత కోళ్ళ అప్పలనాయుడుకు చెందిన భవనంలోనే తెలుగుదేశంపార్టీకి ఆఫీసును తెరవటం జిల్లాలో సంచలనంగా మారింది. సంచలనం ఎందుకంటే పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు అశొక్ బంగ్లాయే పార్టీ ఆపీసు. ఆయన ఇంటి ఆవరణలోని చెట్ల క్రిందే జిల్లా పార్టీ సమావేశాలు జరిగేవి. ప్రత్యేకంగా ఆఫీసు పెట్టమని అడిగే ధైర్యం కూడా నేతలెవరు చేయలేదు ఇంతవరకు. అలాంటిది అశోక్ ను కాదని మీసాల గీత కొత్తగా పార్టీ కార్యాలయం ప్రారంభించటమంటే మామూలు విషయం కాదు.

దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలన్నీ అశోక్ కేంద్రంగానే నడుస్తోంది. జిల్లా నేతల్లో ఎవరు ఏమి మాట్లాడుకున్నా, ఏమి తీర్మానించినా అంతిమంగా జరిగేది మాత్రం అశోక్ గజపతి ఇష్టప్రకారమే. జిల్లాలో తనకు ఎదురన్నదే లేదు కాబట్టే తనంటే గిట్టని వాళ్ళని అశోక్ పట్టించుకునేవారు కాదనే ఆరోపణలు పెరిగిపోయాయి. ఎన్నికలకు ముందు అశోక్ హవాకు చంద్రబాబు కాస్త బ్రేకులు వేశారు. దాంతో అశోక్ టీడీపీని వదిలేసి బీజేపీలో చేరిపోతారనే ప్రచారం అందరికీ తెలిసిందే.

కారణాలు ఏవైనా అధికారం మళ్ళీ అశోక్ చేతికి రావటంతో ప్రచారమంతా చప్పపడిపోయింది. ఈ నేపధ్యంలోనే మొన్నటి ఎన్నికల్లో మీసాలకు విజయనగరంలో టికెట్ రాకుండా అడ్డుకున్న అశోక్ తన కూతురు అదితి గజపతిరాజునే పోటీ చేయించారు. ఇటు తండ్రి, అటు కూతురు ఇద్దరు ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. మామూలుగా కూడా అశోక్ జిల్లా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనబడరు. తనకు వ్యతిరేకం అనుకున్న నేతలను తన దగ్గరకే కాదు చివరకు పార్టీ నుండి కూడా దూరంగా పెట్టేస్తారు.

మీసాల గీతతో పాటు మరికొందరు నేతలను అలాగే అశోక్ పార్టీకి దూరంగా పెట్టేశారు. ఈ విషయాలన్నీ చంద్రబాబునాయుడుకు తెలిసినా పట్టించుకోలేదు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత అశోక్ తో పాటు ఆయన వర్గమంతా పార్టీకి దాదాపు దూరంగానే ఉంటున్నారు. ఈ నేపధ్యంలోనే మీసాల ఆధ్వర్యంలో విజయనగరం హెడ్ క్వార్టర్స్ లో పార్టీకి కొత్తగా కార్యాలయం ఓపెన్ అయ్యింది. అశోక్ అంటేనే ఇపుడు బహిరంగంగానే మీసాల మండిపడుతున్నారు. ఇప్పటికే సంచైత ఓవైపు వాయించేస్తుంటే తాజాగా మీసాల కూడా ఆమెకు తోడైందని జిల్లాలో సెటైర్లు వేసుకుంటున్నారు అశోక్ పైన.