Begin typing your search above and press return to search.

లేడీస్ పంచ్!... మేం లేక‌పోతే మీరెక్క‌డ‌?

By:  Tupaki Desk   |   29 Nov 2017 9:28 AM GMT
లేడీస్ పంచ్!...  మేం లేక‌పోతే మీరెక్క‌డ‌?
X
హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ రెండో రోజు బుధ‌వారం నాటి స‌ద‌స్సులో మ‌హిళ‌లు పంచ్‌ల‌తో విరుచుకుప‌డ్డారు. ముఖ్యంగా పురుషుల‌ను టార్గెట్ చేస్తూ.. వారు పేల్చిన పంచ్‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మేం లేక‌పోతే.. మీరు లేరు-వినూత్న ఆలోచ‌న‌లు పురుషుల అబ్బ‌సొత్తా-మాక‌న్నా పురుషులు గొప్ప‌కాదు-వంటి సంచ‌ల‌న కామెంట్ల‌కు లైకులు ప‌డిపోతున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెలంగాణ ప్ర‌భుత్వం, కేంద్ర ప్ర‌భుత్వాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న గ్లోబ‌ల్ ఎంట‌ర్ ప్రెన్యూర్ షిప్ స‌మ్మిట్‌కు ప్ర‌పంచ న‌లుమూల‌ల నుంచి మ‌హిళా పారిశ్రామిక వేత్తలు వెల్లువెత్తారు.

స‌ద‌స్సులో రెండో రోజు మ‌హిళా శ‌క్తి అనే అంశంపై సుదీర్ఘ ప్ర‌సంగాలు సాగుతున్నాయి. ముఖ్యంగా మ‌హిళ‌లు ఎదిగిన తీరును కొంద‌రు పారిశ్రామిక వేత్త‌లు వివ‌రిస్తుంటే.. మ‌రికొంద‌రు మాత్రం పురుషాధిక్య స‌మాజం అంటూ మొద‌లు పెట్టి.. పురుషుల‌ను తిట్టిపోసే ప‌నిలో బిజీ అయిపోయి.. ఈ వేదిక‌ను వాడేసుకుంటున్నారు. సదస్సులో పాల్గొన్న పలువురు మహిళా దిగ్గజాలు, ఈ ప్రపంచంలో అన్ని రంగాల్లో పురుషులతో మహిళలు సమానమేనని, అయితే, వారి అవకాశాలు వంటింటికి మాత్రమే పరిమితం చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. వినూత్న ఆలోచనలు పురుషుల అబ్బసొత్తేమీ కాదని డెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కరెన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అద్భుత ఫలితాలను సాధించాలంటే చర్చల్లో మహిళలకు ప్రమేయం కల్పించి చూడాలని, ఒక్కసారి వారి ఆలోచనలు వింటే, మరేమాత్రం ఆలోచించకుండా అటువైవే అడుగులు వేస్తారని సూచించారు. మహిళలు ఏం చేసినా పురుషులకు మేలే జరుగుతుందని, ఏ పురుషుడైనా విజయం సాధించాడంటే, ఆయన వెనుక ఓ తల్లి - చెల్లి - భార్య - స్నేహితురాలి రూపంలో ఓ మహిళ తప్పక ఉంటుందన్న విషయాన్ని మరువరాదని చెర్రీ బ్లెయిర్ వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికైనా అభివృద్ధి చెందుతున్నామ‌న్న దేశాలు మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం పెంచాల‌ని సూచించారు. వంటింటికే ప‌రిమిత‌మ‌య్యే మ‌హిళ‌లు రాబోయే రోజుల్లో క‌నిపించ‌ర‌ని చెప్పారు. సాధ్య‌మైనంత వేగంగా మ‌హిళా ప్ర‌పంచం మేల్కొంటోంద‌న్నారు. సో.. మొత్తానికి ఈ స‌ద‌స్సులో మ‌హిళ‌ల సాధికార‌త వెల్లివిరుస్తోంద‌న్న‌ది మ‌హిళా సంఘాల ఉవాచ‌. మ‌రి మ‌రో రోజు జ‌ర‌గ‌నున్న ఈ స‌ద‌స్సు ఇంకెన్ని విశేషాల‌కు వేదిక అవుతుందో చూడాలి.