Begin typing your search above and press return to search.

ఎన్నికల వేళ.. వీరి పంట పండింది..

By:  Tupaki Desk   |   26 Nov 2018 11:04 AM GMT
ఎన్నికల వేళ.. వీరి పంట పండింది..
X
ఎన్నికల ప్రచారం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. నాయకుడు కదిలివస్తుంటే.. వెనుక కార్యకర్తలు పోలో మంటూ వెంట నడవాలి. చప్పట్లు కొట్టాలి.. పొగడాలి.. దండేసి.. దండం పెట్టాలి. ఆయన అంటే అంత కాదు.. ఇంతటి వాడనాలి. గతంలో పోటీ చేస్తున్న అభ్యర్థి మైక్ పట్టుకుంటే.. ఆసక్తిగా ఆలకించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి చాలా చోట్ల కనబడటం లేదు. ప్రజల్లో పరువు పోతుందని భావించి.. చాలా మంది ప్రచారాలకు కూలీలను ఆశ్రయిస్తున్నారు.

కొంతమంది ఎన్నికల ప్రచారానికి మనుషులు కేటాయించేందుకు ఏజెన్సీలుగా మారారు. ఎవరికి ఎంతమంది ఎక్కడ కావాలో చెబితే.. అక్కడకు అంతమందిని పంపేస్తున్నారు. అభ్యర్థులందరూ దాదాపు కూలీలు కావాలని చెబుతుండటంతో.. సదరు కూలీలకు డిమాండ్ పెరిగింది. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు వారికే ప్రచారం చేస్తున్నారు.

జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఇవాళ ఫలానా పార్టీ అభ్యర్థి ముందు వెనుక ఉన్న కార్యకర్తలు(కూలీ)లు.. రేపు ఇంకో పార్టీకి జై కొడుతూ కనిపిస్తున్నారు. ఏదైనా పార్టీకి స్థానికంగా ఊపు తీసుకువచ్చే అంశాల్లో పార్టీ చేరికలు ఒకటి. ఇక్కడ కూడా విచిత్రం చోటుచేసుకుంటుంది. భారీగా పార్టీలో చేరికలు అంటూ.. ఊదరగొట్టడం. అసలు ఆ పార్టీలో చేరే వారిలో దాదాపు ఈ దినసరి కూలీలే ఉంటుండడం గమనార్హం.

ఎన్నికలు చాలా మందికి ఉపాధి చూపించాయనడంలో అతిశయోక్తి లేదు. దినసరి కూలీలు, పనులు చేసుకోలేని వాళ్లకు మూడు పూటలా ఎన్నికల వల్ల తిండి దొరుకుతోంది. తప్పనిసరిగా మందు ఉండాల్సిందే కాబట్టి.. దానికి కూడా ఢోకా లేదు. ఒక్కో రోజు కూలీ దొరక్కపోవచ్చేమో కానీ, ప్రచారానికి వెళ్తే ఖచ్చితంగా డబ్బులు ముడతుండటంతో చాలా మంది పార్టీ ప్రచార కూలీలుగా మారడానికి సిద్ధపడుతున్నారు. ఇలా ఎన్నికలు ఏడాదిలో మూడు సార్లు వస్తే బావుండునని అంటున్నారు. ఎన్నికల వేళ అభ్యర్థులకు ఖర్చు తడిసి మోపెడవుతున్నా.. కూలీలకు మాత్రం కడుపునిండా తిండి.. కావాల్సినంత కూలీ లభిస్తుండడం విశేషం.