Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌లో ఆ లేడీ డాక్ట‌ర్ లైఫ్ లో రెండేళ్లు మిస్?

By:  Tupaki Desk   |   16 April 2019 4:49 AM GMT
హైద‌రాబాద్‌లో ఆ లేడీ డాక్ట‌ర్ లైఫ్ లో రెండేళ్లు మిస్?
X
ఒక అమ్మాయి. ఉన్న‌ట్లుండి మెలుకువ వ‌స్తుంది. క్యాలెండ‌ర్ చూస్తుంది. ఆమెకు గుర్తున్నంత వ‌ర‌కూ మూడు రోజుల ముందు వ‌ర‌కు జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌న్ని గుర్తుంటాయి. కానీ.. మూడు రోజులు మిస్ అవుతాయి. రీల్ లో ఇలాంటి సీన్లు ఇప్ప‌టికే చూసి ఉంటాం. కానీ.. హైద‌రాబాద్‌ లోని ఒక లేడీ డాక్ట‌ర్ జీవితంలో ఏకంగా రెండేళ్లు మిస్ అయిన వైనం తాజాగా వెలుగు చూసింది.

సినిమాను త‌ల‌పించేలా ఈ ఉదంతంలోకి వెళితే.. మెడిసిన్ చేయాల‌న్న ల‌క్ష్యంతో యూపీలోని వార‌ణాసికి చెందిన ఒక మ‌హిళ హైద‌రాబాద్‌ కు వ‌చ్చింది. మొయినాబాద్‌ లోని వీఆర్కే మెడిక‌ల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. త‌ర్వాత ఏడాది పాటు ఇంట‌ర్న్ షిప్ కూడా పూర్తి చేసింది. త‌ర్వాత ఏమైందో తెలీదు. మ‌తిస్థిమితం కోల్పోయారు. ఆమె ఎవ‌రో తెలీని ప‌రిస్థితి. అనుమాన‌స్ప‌దంగా పోలీసుల‌కు క‌నిపించారు. దీంతో.. ఆమెను తీసుకొని హైద‌ర్షాకోట్ లోని క‌స్తూర్బా అనాథాశ్ర‌మంలో చేర్పించారు.

గ‌డిచిన 18 నెల‌లుగా చికిత్స పొందుతున్న ఆమె మామూల‌య్యారు. అప్ప‌టివ‌ర‌కూ వైద్యం చేయించుకుంటున్న ఆమె డాక్ట‌ర్ అన్న విష‌యాన్ని ఆమె చెప్పారు. ఆమె మాట‌లు విన్న వారికి న‌మ్మ‌కం క‌ల‌గ‌లేదు. త‌న పేరు..ఊరు.. త‌న నేప‌థ్యాన్ని ఆమె చెప్ప‌టంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. అధికారుల‌కు స‌మాచారం ఇచ్చి.. వారి సూచ‌న‌తో ఆమె వివ‌రాల్ని ఆమె కుటుంబ స‌భ్యుల‌కు తెలిపారు. రెండేళ్లుగా ఆమె ఏమైందో తెలీని స్థితిలో ఉన్న వారి కుటుంబ స‌భ్యులు హైద‌రాబాద్‌ కు వ‌చ్చారు.

విషాదం ఏమంటే.. ఈ రెండేళ్ల వ్య‌వ‌ధిలో ఆమె తండ్రి మ‌ర‌ణించారు. త‌ల్లి అస్వ‌స్థ‌తో క‌ద‌ల్లేని ప‌రిస్థితి. ఆమె బంధువులు హైద‌రాబాద్ కు వ‌చ్చి.. ఆమెను ప‌లుక‌రించారు.. ప‌రామ‌ర్శించారు. ఆమె ఆచూకీ తేల‌టం బాగానే ఉన్నా.. ఆమె జీవితంలో విలువైన రెండేళ్లు ఎలా మిస్ అయ్యాయి? ఆమె మాన‌సిక ప‌రిస్థితి ఎందుకు మారింద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌. త‌మ అనాధాశ్ర‌మానికి వ‌చ్చిన కొత్త‌ల్లో చాలా కోపంగా ఉండేద‌ని.. త‌ర్వాత మారిన‌ట్లు అక్క‌డి సిబ్బంది చెబుతున్నారు. ఆమె జీవితంలో రెండేళ్లు మిస్ కావ‌టానికి దారి తీసిన ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది మాత్రం ఫ‌జిల్ గా మారింది. ఆ వివ‌రాలు వెల్ల‌డి కాలేదు. రీల్ ను త‌ల‌పించేలా ఉన్న ఈ ఉదంతం ఇప్పుడు ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.