Begin typing your search above and press return to search.

ఎర్రచందనం లేడీ డాన్‌ ఏమయ్యారు..?

By:  Tupaki Desk   |   9 April 2015 2:30 PM GMT
ఎర్రచందనం లేడీ డాన్‌ ఏమయ్యారు..?
X
శేషాచలం అడవుల్లో భారీ ఎన్‌ కౌంటర్‌ దెబ్బకు ఎర్రచందనం స్మగ్లర్లంతా అండర్‌ గ్రౌండ్‌ లోకి వెళ్లిపోయారు. గతంలో తిరుపతి సమీపంలోని భాకరాపేట నుండి బెంగళూరు మీదుగా మంగళూరు పోర్టుకు ఎర్రచందనం రవాణా యమాజోరుగా సాగేది. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక రాజకీయ నాయకుడి అండతో కర్ణాటకలోని కోలారు జిల్లాకు చెందిన ఒక మహిళ గత 15 ఏళ్లుగా ఈ స్మగ్లింగ్‌ లో ఆరితేరిపోయారు. ఆమెను చిత్తూరు అటవీ శాఖ అధికారులు అనేక సార్లు అరెస్టు చెయ్యడానికి విఫలయత్నం చేశారు. నిత్యం 20 మందికి తగ్గకుండా ఆమె చుట్టూ అనుచరులు ఉంటారు. దీంతో తిరుపతి ప్రాంతంలో ఆమెను అంతా లేడీ డాన్‌ అంటారు.

ఎర్రచందనాన్ని రోడ్డు మార్గంలో రహస్యంగా తరలించడంలో ఆమెను మించినవారు లేరని పేరు. ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో పోలీసులను, అటవీ అధికారులను బురిడీ కొట్టించేది. అంబులెన్సులు, నీళ్ల ట్యాంకులు, పెట్రోలు ట్యాంకులు, పాల ట్యాంకర్లే కాదు... చివరకు సెప్టిక్‌ ట్యాంకుల క్లీనింగు వాహనాల్లోనూ ఎర్రచందనం తరలించేవారు. బెంగళూరులోని వ్యాపారులు ఈమె దగ్గర ఒక కేజీ ఎర్రచందనం రూ. 3 వేల నుండి రూ. 5 వేల వరకూ కొనుగోలు చేస్తారని చెప్తుంటారు. అయితే, వ్యూహరచనలో ఆరితేరిన ఆమె ఎర్ర చందనం స్మగ్లర్లను పట్టుకోవడానికి ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేసిన సమయంలోనే తన కార్యకలాపాలు తగ్గించారని సమాచారం. తాజాగా శేషాచలం అడవుల్లో 20 మంది తమిళ కూలీలు ఎన్‌ కౌంటర్‌ కావడంతో లేడి డాన్‌ తో పాటు ఆమె అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని అంటున్నారు.