Begin typing your search above and press return to search.

కొత్త ఆసక్తి; ఎవరూ శాశ్వత శత్రువులు కాదు

By:  Tupaki Desk   |   25 Sep 2015 3:53 AM GMT
కొత్త ఆసక్తి; ఎవరూ శాశ్వత శత్రువులు కాదు
X
ఒకే రోజు రెండు వేర్వేరు సంఘటనలు. వాటి సారం మాత్రం ఒక్కటే. సంబంధం లేనట్లు కనిపించినా రెండు ఘటనల వెనుక రాజకీయం కీలకమైతే.. భేటీ అయిన తీరు రాజకీయ ప్రాధాన్యతతో పాటు.. సామాన్యుల దృష్టిని ఇట్టే ఆకర్షించేలా ఉండటం గమనార్హం.

రాష్ట్ర విభజన నేపథ్యంలో తాను ముందుగానే శపధం చేసినట్లుగా రాజకీయ సన్యాసం ప్రకటించి.. దానికి కట్టుబడి ఉన్నారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. విభజన కానీ జరిగితే రాజకీయాల నుంచి వైదొలుగుతా అంటూ ఆయన చేసిన శపధం.. సమకాలీన రాజకీయ నేతల మాదిరే ఉంటుందని భావించినా.. ఆయన మాత్రం తన మాటకు కట్టుబడి ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఉప్పు.. నిప్పులా ఉండే రాజగోపాల్.. చంద్రబాబుల మధ్య తాజా భేటీ రాజకీయ ఆసక్తే. రాజధాని నిర్మాణం లాంటి అంశాల మీద తాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడినట్లుగా లగడపాటి చెప్పిన తీరు చూస్తే.. రాజకీయ సన్యాసం ప్రకటించిన ఒక వ్యక్తితో.. ఒక ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చలు జరుపుతారా? అన్నది ఒక సామాన్యమైన ప్రశ్న.

రాజధాని నిర్మాణం లాంటి అంశాల కంటే కూడా.. అంతకు మించి మరేదో ఉంటుందని రాజకీయాల గురించి పెద్దగా తెలీని వారు కూడా అర్థం చేసుకునే పరిస్థితి. చంద్రబాబు పార్టీలోకి లగడపాటి చేరుతున్నారా? దానికి సంబంధించిన చర్చలే జరిపారా? అన్నవి ప్రశ్నలు. భేటీ అయిన ఇరువర్గాలూ దానికి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయని పరిస్థితి. ఈ నేపథ్యంలో లగడపాటి టీడీపీలోకి ఎంట్రీ ఇస్తారా? అన్నది ప్రాధమికంగా కలిగే సందేహం. నిజంగా బాబు పార్టీలో చేరాలని లగడపాటి అనుకుంటే.. దాన్ని ఆపేవారు ఎవరు? ఆయనేమైనా విపక్షంలోక్రియాశీలక రాజకీయాలు నడుపుతున్నారా అంటే అదీ లేదు.

అలాంటప్పుడు పార్టీలో చేరటానికి ముందు అందరికి తెలిసేలా భేటీ అవుతున్నారా? అన్నది మరో ప్రశ్న. నిజంగా అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా అన్నది మరో సందేహం కలగక మానదు. ఆయన కానీ టీడీపీ తీర్థం పుచ్చుకోవాలని భావిస్తే.. అందుకు సంబంధించిన కసరత్తు అంతా లోగుట్టుగా పూర్తి చేసేసి చేరిపోతారు. నిజానికి చంద్రబాబుతో లగడపాటి భేటీ కంటే కూడా.. లగడపాటిని విజయవాడ ఎంపీ కేశినేని నాని వెంటబెట్టుకు తీసుకెళ్లటం ఆసక్తికర వ్యవహారంగా చెప్పాలి. బాబుతో భేటీతోనే లగడపాటి రీఎంట్రీ గురించి అంచనాలు వేయటం కాస్త తొందరపాటే అవుతుంది. అలా అని.. ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని చెప్పటం అమాయకత్వమే అవుతుంది.

ఇదిలా ఉంటే.. ఉప్పు నిప్పు లాంటి రామోజీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ లు భేటీ కావటం అన్నింటికి మించిన సంచలనంగా చెప్పాలి. రెండు మీడయా గ్రూపుల మధ్య బహిరంగ యుద్ధమే జరిగి.. వారి మధ్య శత్రుత్వం తెలుగు ప్రజలకు చాలానే వార్తలు పుట్టించేలా చేసింది. అలాంటి వీరిద్దరూ భేటీ కావటం కీలక పరిణామం. అందులోకి జగన్ లాంటి వ్యక్తి.. రామోజీ ఫిలింసిటీకి వెళ్లి మరీ.. రాజగురువుగా తన పత్రికలో రాసే రామోజీరావుని కలవటం.. ఆ భేటీకి మర్యాదపూర్వకం అన్న ట్యాగ్ లైన్ తగిలించటం అసలుసిసలు రాజకీయంగా చెప్పాలి.

విశేషంగా చెప్పాలంటే.. రామోజీరావుతో రాజీ కోసం ఎంతోమంది దూతల్ని పంపిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ చేయలేని పనిని జగన్ చేశారని చెప్పాలి. అధికారం ఉన్న నేపథ్యంలో రామోజీని కలిసేందుకు వైఎస్ పెద్దగా ఇష్టపడకపోయి ఉండకపోవచ్చు. కానీ.. తన తండ్రి చేయలేని పనిని జగన్ చాలా తొందరగా చేసిన తీరు చూస్తే.. ఆయనలో రాజకీయ పరిణితి వచ్చేసినట్లేనని చెప్పక తప్పదు.

జగన్ లాంటి వ్యక్తి.. ఒకరి అధిపత్యాన్ని సవాలు చేయటమే కానీ.. సమర్థించటం అన్నది ఆయన బాడీ లాంగ్వేజ్ కు.. మైండ్ సెట్ కు ఏ మాత్రం సూట్ కాదు. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరించిన తీరును ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘‘ఎవరూ శాశ్వత శత్రువులు కారు’’ అని చెప్పక తప్పదు.