Begin typing your search above and press return to search.

లగడపాటి కింగ్ మేకర్ కాబోతున్నాడా?

By:  Tupaki Desk   |   23 Oct 2017 4:46 AM GMT
లగడపాటి కింగ్ మేకర్ కాబోతున్నాడా?
X
లగడపాటి రాజగోపాల్.. అధికారికంగా అయితే.. ప్రస్తుతానికి రాజకీయంగా ఎలాంటి ముద్రలేని తటస్థ వ్యక్తి. అయితే ఆయన ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కీలకంగా భేటీలు జరుపుతూ ఉంటారు. మరొకవైపు నంద్యాల లాంటి ఉప ఎన్నికలు వస్తే కూడా తను తన సొంత ఖర్చుతో సర్వేలు చేయించి.. ప్రభుత్వంలోని పార్టీ గెలుస్తుందని చెబుతూ.. అంతా నా ఆసక్తి కోసమే చేశానని సెలవిస్తుంటారు... ఇలా వ్యవహారాలు నర్మగర్భంగా నడిపిస్తూ ఉంటారు. అయితే తాజాగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం లగడపాటి రాజగోపాల్ కింగ్ మేకర్ కాబోతున్నారా? అనే చర్చ సాగుతోంది. రాష్ట్రంలో రెండో ప్రత్యమ్నాయంగా రావాలని, అధికారంలో వాటా దక్కించుకునే స్థాయిలో అయినా సరే సక్సెస్ కావాలని ఆరాటపడుతున్న పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి లగడపాటి రాజగోపాల్ వెన్నుదన్నుగా ఉంటూ వ్యూహరచన చేస్తున్నారని, తద్వారా పవన్ కల్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓ కీలక వ్యక్తిగా నిలిపి... తాను కింగ్ మేకర్ గా చక్రం తిప్పుతూ ఉండాలనే కోరికతో ఉన్నట్లుగా చర్చోపచర్చలు సాగుతున్నాయి.

లగడపాటికి వ్యూహకర్తగా చాలా పేరున్నదనడంలో సందేహం లేదు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ.. ప్రజాదరణ పొందడంలో చాలా కష్టపడి ఒక ఎపిసోడ్ నడిపిస్తే.. దానికి అనుకరణగా తాను కూడా ఒక డమ్మీ ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆస్పత్రికి తరలిస్తుండగా.. స్ట్రెచర్ మీదనుంచి చెంగున దూకి పారిపోయినా.... పార్లమెంటులో పెప్పర్ స్ప్రే చల్లి సభ్యుల రగడను రసాభాసగా మార్చేసినా.. ఇలాంటి సంచలన వ్యూహాలు అన్నీ ఆయనకే చెల్లు.

ఏది ఏమైనప్పటికీ.. రాజకీయాల్లో ప్రజల నాడిని అంచనా వేయడంలో మాత్రం లగడపాటికి చాలా పేరుంది. జోస్యాలు చెప్పే ఆక్టోపస్ తో ఆయనను పోల్చి చాలా మంది మాట్లాడుతుంటారు. ఆయన చెప్పే ఎన్నికల సర్వేలు చాలా వరకు కరెక్టే అని తేలుతుంటాయి. అలాంటి లగడపాటి రాజగోపాల్ పవన్ కల్యాణ్ కు వెనుక ఉండి వ్యవహారాలు నడిపిస్తున్నట్లుగా తెలుస్తున్నది. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దిగుతాం అని పవన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కనీసం కొన్ని సీట్లు అయినా గెలుచుకుని రాష్ట్రంలో వారు కీలక పార్టీగా ఆవిర్భవిస్తారనడంలో సందేహం లేదు. ఎటొచ్చీ.. పవన్ ను కింగ్ పొజిషన్ లో ఉంచాక, కింగ్ మేకర్ గా లగడపాటి ఏ పదవిలోకి వెళ్తారనేది కొత్త చర్చగా మొదలు కావొచ్చు.