Begin typing your search above and press return to search.

ల‌గ‌డ‌పాటికి పాలిటిక్స్ ప్రాణంతో స‌మాన‌మ‌ట‌!

By:  Tupaki Desk   |   25 Aug 2017 12:12 PM GMT
ల‌గ‌డ‌పాటికి పాలిటిక్స్ ప్రాణంతో స‌మాన‌మ‌ట‌!
X
ల‌గ‌డపాటి రాజ‌గోపాల్‌... ప‌రిచయం అక్క‌ర్లేని పేరు. బెజ‌వాడ ఎంపీగా - కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌గా కంటే కూడా... తెలుగు నేల విభ‌జ‌న స‌మ‌యంలో పార్ల‌మెంటులో పెప్ప‌ర్ స్ప్రే బాటిల్ తీసి ఎంపీలంద‌రినీ షాక్‌ కు గురి చేసిన నేత‌గా ప్ర‌తి ఒక్కరిరీ ఆయ‌న చాలా ప‌రిచ‌య‌మున్న వ్యక్తిగానే చెప్పవ‌చ్చు. ఉమ్మ‌డి ఏపీ విభ‌జ‌న‌ను పూర్తిగా వ్య‌తిరేకించిన వారి జాబితా తీస్తే... అందులో ల‌గ‌డ‌పాటినే తొలి వ్యక్తిగా చెప్పుకోవాలి. పారిశ్రామిక‌వేత్త‌గా ఉన్నప్ప‌టికీ ఆయ‌న రాజ‌కీయాల్లో చాలా చురుగ్గా వ్య‌వ‌హ‌రించారు. 2009 ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ లోక్ స‌భ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ల‌గ‌డ‌పాటి విజ‌యఢంకా మోగించారు. అంత‌కుముందు కూడా క్రియాశీల రాజ‌కీయాల్లో ఉన్న ల‌గ‌డ‌పాటి... ఏ అంశంపై మాట్లాడినా అది సంచ‌ల‌నంగానే మారింది.

త‌న‌తో పాటు సీమాంధ్ర ప్ర‌జ‌ల మ‌నోభీష్టాల‌కు వ్య‌తిరేకంగా రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగితే... తాను రాజకీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని ప్ర‌క‌టించిన ల‌గ‌డ‌పాటి... చెప్పినట్లే రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన మ‌రుక్ష‌ణ‌మే ఆయ‌న పాలిటిక్స్ నుంచి త‌ప్పుకున్నారు. అయితే రాజ‌కీయాల‌పై త‌న‌కున్న మ‌మ‌కారంతో ఆయన ఇంకా రాజ‌కీయాల‌ను అంటిపెట్టుకునే ఉంటున్నార‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. మొన్న‌టికి మొన్న టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడితో భేటీ అయిన ఆయ‌న‌... తిరిగి పాలిటిక్స్‌ లో చేరుతున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ త‌ర్వాత దీనిపై ఆయ‌న గానీ, టీడీపీ గానీ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

అయినా ఇప్పుడు ల‌గ‌డ‌పాటి గురించిన ప్ర‌స్తావ‌న ఎందుకంటే... దేశంలో ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా ఫ‌లితాల‌కు ముందుగానే ప‌క్కా రిజ‌ల్ట్ చెప్పే వ్య‌వస్థ‌ను ఆయ‌న ఏర్పాటు చేసుకున్నారు కాబ‌ట్టి. ఇప్పుడు తెలుగు ప్ర‌జ‌లంతా ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్న నంద్యాల ఉప ఎన్నిక‌పైనా ఆయ‌న ఆధ్వ‌ర్యంలో ఫ్లాష్ టీం చేసిన స‌ర్వే వివ‌రాల‌ను ఆయ‌న ఇప్ప‌టికే వెల్ల‌డించారు. నంద్యాల‌లో వైసీపీదే విజ‌య‌మ‌ని ఓ సారి... ఆ త‌ర్వాత అక్కడ టీడీపీ విజ‌యం సాధిస్తుంద‌ని మ‌రోసారి ప్ర‌క‌టించిన ఆయ‌న ఇప్పుడు జ‌నాన్ని అయోమ‌యంలో ప‌డేశార‌నే చెప్పాలి. ల‌గ‌డ‌పాటి తాజా స్టేట్ మెంట్ కూడా కాస్తంత గంద‌ర‌గోళంగానే ఉంద‌ని చెప్పాలి. ఎందుకంటే... నేటి మ‌ధ్యాహ్నం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ల‌గడ‌పాటి... నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం సాధిస్తుంద‌ని త‌మ టీం తేల్చింద‌ని ఆయ‌న చెప్పారు. అయితే ఏఏ అంశాలు టీడీపీ గెలుపున‌కు కార‌ణ‌మ‌వుతాయన్న విష‌యాన్ని మాత్రం తాను చెప్ప‌లేన‌ని ల‌గ‌డ‌పాటి ప్ర‌క‌టించారు.

స‌రే... ఎలాగూ అక్క‌డ పోలింగ్ ముగిసి ఇప్ప‌టికే రెండు రోజులైపోయింది. మ‌రో రెండు రోజులు ఓపిక ప‌డితే... విజ‌యం ఎవ‌రిదో తేలిపోతుంది. అప్పుడు ఈ స‌ర్వేల‌న్నీ అవ‌స‌రం లేదు. ఇదిలా ఉంటే.. ఈ స‌ర్వేపై మాట్లాడిన సంద‌ర్భంగా ల‌గ‌డ‌పాటి త‌న పొలిటిక‌ల్ రీ ఎంట్రీపైనా ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు. మాట‌కు క‌ట్టుబ‌డే రాజ‌కీయాలకు దూరంగా ఉన్న తాను... తిరిగి రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ప్ర‌సక్తే లేద‌ని ఆయ‌న తేల్చేశారు. అంతేకాకుండా రాజ‌కీయాలంటే త‌న‌కు ప్రాణంతో స‌మాన‌మ‌ని, అయిన‌ప్ప‌టికీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చే స‌మ‌స్యే లేద‌ని కూడా ఆయ‌న తేల్చి పారేశారు. అయితే త‌న‌కు ప్రాణ స‌మాన‌మైన రాజ‌కీయాల‌పై విశ్లేష‌ణ‌లు, స‌ర్వేలు చేస్తూ కాలం వెళ్ల‌దీస్తాన‌ని ల‌గడ‌పాటి చెప్పుకొచ్చారు.