Begin typing your search above and press return to search.

ల‌గ‌డ‌పాటి నెత్తిన మ‌రో దివాలా ప‌డిందే!

By:  Tupaki Desk   |   30 March 2018 9:19 AM GMT
ల‌గ‌డ‌పాటి నెత్తిన మ‌రో దివాలా ప‌డిందే!
X
కాంగ్రెస్ పార్టీ మాజీ నేత‌, విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ కు ఇటీవ‌లి కాలం అంత‌గా క‌లిసి రానట్టుంది. తెలుగు నేల విభ‌జ‌న‌ను అడ్డుకునేందుకు త‌న శ‌క్తినంతా కూడ‌దీసుకుని ల‌గ‌డ‌పాటి శ్ర‌మించినా... ఫ‌లితం ద‌క్క‌క‌పోగా... తెలుగు నేల‌ను ఆయ‌న ప్రాతినిథ్యం వ‌హించిన కాంగ్రెస్ పార్టీనే అన్యాయంగా విడ‌గొట్టేసింది. ఈ కార‌ణంగా పార్టీపై అలిగిన ల‌గ‌డ‌పాటి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయ‌డంతో పాటుగా ఏకంగా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఎంతైనా రాజ‌కీయం రుచి మ‌రిగిన నేత క‌దా... క్రియాశీల రాజ‌కీయాల్లో య‌మా యాక్టివ్ గా ఉన్న ల‌గ‌డ‌పాటి ఎంతోకాలం రాజ‌కీయాల‌కు దూరంగా ఉండలేర‌న్న వాద‌న అప్పుడెప్పుడో వినిపించింది. అయితే ఆయ‌న మాత్రం ఇప్ప‌టికీ రాజ‌కీయాల‌తో అంటీముట్ట‌నట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టికీ ఏ పార్టీలోనూ చేర‌కుండా త‌ట‌స్థంగానే ఉండిపోయారు.

స‌రే... రాజ‌కీయంగా ల‌గ‌డ‌పాటి ప‌రిస్థితి ఇలా ఉంటే.. రాజ‌కీయాల కంటే ముందు ఆయ‌న పేరుమోసిన వ్యాపారవేత్త అన్న విష‌యం కూడా మ‌న‌కు తెలిసిందే క‌దా. ల్యాంకో పేరిట ఏర్పాటైన ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ కూడా ల‌గ‌డ‌పాటి ఫ్యామిలీవే. ల‌గ‌డ‌పాటి రాజ‌కీయాల్లోకి రానంత‌వ‌ర‌కు ఈ కంపెనీలు బాగానే రాణించాయి. ల‌గ‌డ‌పాటి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత చాలా కాలం వ‌ర‌కు కూడా ఈ కంపెనీలు త‌మ‌దైన శైలిలో స‌త్తా చాటాయి కూడా. అయితే రాజ‌కీయాల్లో ల‌గ‌డ‌పాటి క‌నుమ‌రుగవుతున్నట్లుగానే ఆయ‌న కంపెనీలు కూడా ఒక్క‌టొక్క‌టిగా న‌ష్టాల్లో చిక్కుకుంటున్నాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల‌ను చెల్లించేందుకు ఆ కంపెనీలు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నాయి. కొన్ని కంపెనీలు ఏకంగా దివాలా తీస్తున్నాయి. మొత్తంగా ల‌గ‌డ‌పాటి ప్ర‌భ‌ను అంత‌కంత‌కూ దిగ‌జార్చేస్తున్నాయి.

అలాంటి ఘ‌ట‌నే ఇప్పుడు ఒక‌టి చోటుచేసుకుంది. లగడపాటి ఫ్యామిలీకి చెందిన ల్యాంకో తీస్థా హైడ్రో పవర్ లిమిటెడ్... ఐసీఐసీఐ సహా పలు బ్యాంకుల నుంచి రూ. 313.10 కోట్లను రుణంగా పొంది తిరిగి తీర్చడంలో విఫలమైన నేపథ్యంలో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు దివాలా ప్రక్రియ మొదలైంది. ఐఆర్పీ (దివాలా పరిష్కార నిపుణుడు)గా హుజేఫా సితాబ్ ఖాన్ ను నియమించినట్టు వెల్లడించింది. ల్యాంకో తీస్థా సంస్థ తన ఆస్తులను విక్రయించరాదని, బదలాయింపు తాకట్టు పెట్టడం వంటి పనులు చేసేందుకు కూడా చేయరాదని ఈ సందర్భంగా ట్రైబ్యునల్ పేర్కొంది. దివాలా ప్రక్రియ మొదలైనట్టు ప్రకటన ఇవ్వాలని, ఇన్ సాల్వెన్సీ బ్యాంక్ రప్టెసీ బోర్డ్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ లో వివరాలు ఉంచాలని ఆదేశించింది. రుణదాతలతో కమిటీ వేసి, సంస్థ ఆస్తిపాస్తుల వివరాలు బయటకు తీయాలని పేర్కొంటూ తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

ల్యాంకో తీస్థా ప్ర‌స్థానం విష‌యానికి వ‌స్తే... 2007లో సిక్కింలోని తీస్థా నదిపై 500 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం ఐసీఐసీఐ నేతృత్వంలోని పలు బ్యాంకుల కన్సార్టియం నుంచి ల్యాంకో సంస్థ రూ. 400 కోట్లను రుణంగా తీసుకుంది. ఈ రుణాన్ని తిరిగి చెల్లించడంలో సంస్థ విఫలం కాగా, గతంలోనే దీన్ని మొండి బకాయిల జాబితాలో చేరుస్తున్నట్టు ఐసీఐసీఐ పేర్కొంది. చెల్లించిన మొత్తం మినహాయిస్తే గత సంవత్సరం నవంబర్ నాటికి మొత్తం బకాయి 313.10 కోట్లకు చేరగా, బ్యాంకుల జాయింట్ లెండర్స్ ఫోరం నోటీసులు కూడా ఇచ్చింది. జల విద్యుత్ కేంద్రాల తిరోగమనంతో తమకు నష్టం వాటిల్లిందని ల్యాంకో తీస్థా న్యాయవాదులు వాదించినప్పటికీ ఆ వాదనలను ట్రైబ్యునల్ తోసిపుచ్చింది.