Begin typing your search above and press return to search.

కేసీఆర్ ల‌గ‌డ‌పాటి భేటీలో పెళ్లితో పాటు ఎన్నో ముచ్చ‌ట్లు

By:  Tupaki Desk   |   16 Nov 2017 3:42 AM GMT
కేసీఆర్ ల‌గ‌డ‌పాటి భేటీలో పెళ్లితో పాటు ఎన్నో ముచ్చ‌ట్లు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోమారు సంచ‌ల‌న వార్త‌ను అందించారు. ఉద్య‌మ‌కాలంలో ఉప్పు నిప్పులా ఉన్న టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ భేటీ అయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో తెలంగాణవాదుల చేతుల్లో దెబ్బలు తిని, విజయవాడలో ఆమరణ నిరాహారదీక్ష చేసి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చి, నిమ్స్‌లో ఉరుకులు పరుగులతో బెడ్‌మీద చేరి, చివరకు తాను తిట్టిపోసిన కేసీఆర్‌తోనే ఐలవ్‌యు అని చెప్పించుకున్న లగడపాటి రాజగోపాల్....రాజ‌కీయాల‌కు దూరం అంటూనే జోస్యాలు చెప్తూ టైం గ‌డిపేస్తున్నారు. తాను రాజకీయ సన్యాసం చేశానని ప్రకటించుకుంటూనే ..రాజ‌కీయ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉంటున్నారు. అలాంటి ల‌గ‌డ‌పాటి కేసీఆర్‌తో భేటీ అవ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే.

అయితే రాజకీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం...ల‌గ‌డపాటి రాజ‌గోపాల్ త‌న కుమారుడి వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు ఆయ‌న‌తో స‌మావేశ‌మ‌య్యారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాస‌మైన ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఈ స‌మావేశం జ‌రిగింది. అయితే, ఈ భేటీ కేవ‌లం ఆహ్వాన‌ ప‌త్రిక అందించేందుకు మాత్ర‌మే ప‌రిమితం కాలేద‌ని స‌మాచారం. తెలుగు రాష్ర్టాల రాజ‌కీయాల గురించి ఈ సంద‌ర్భంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ‌లో ఆయా రాజ‌కీయ పార్టీల బ‌లాబ‌లాలు, 2019 ఎన్నిక‌లు వంటివి చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాద‌యాత్ర‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌భావం, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌నితీరు, ఏపీలో బ‌ల‌హీన‌ప‌డుతున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు, ఢిల్లీ రాజ‌కీయాలు వంటివి చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.