Begin typing your search above and press return to search.

లగడపాటి రీఎంట్రీ.. నిజమెంత?

By:  Tupaki Desk   |   3 Oct 2021 4:30 PM GMT
లగడపాటి రీఎంట్రీ.. నిజమెంత?
X
మాట మీద నిలబడతామని చెప్పే రాజకీయ నేతలెవరూ చేయని పని ఏదైనా ఉందంటే.. అది చెప్పిన మాట మీద నిలబడటం. ఈ కారణంగానే అలాంటి మాటలు కామెడీగా మారాయి. అయితే.. అందరూ ఒకేలా ఉండరన్న మాటకు తగ్గట్లే.. రాజకీయాల్లోనూ ఏదైనా సవాలు చేసినా.. శపధం చేసిన తర్వాత దానికి కట్టుబడి ఉండే నేతలు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ కోవలోకే వస్తారు లగడపాటి రాజగోపాల్. మాజీ కాంగ్రెస్ ఎంపీగా సుపరిచితుడైన ఆయన.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎపిసోడ్ లో ఆయన వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ గా నడిచేది. సీమాంధ్ర నేతల దౌర్జన్యాలకు.. వారి అధిపత్యతకు సులువుగా చూపించే నేతగా లగడపాటి నిలిచేవారు.

తెలంగాణ వాదం తీవ్రంగా వినిపించే వేళ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే అవకాశమే లేదని చెప్పటమే కాదు.. ఒకవేళ విభజన జరిగితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరారు. లోక్ సభలో విభజన బిల్లు పెట్టిన వేళ.. తన మీద దాడికి యత్నించిన వారిపై పెప్పర్ స్ప్రే చేయటం సంచలనంగా మారింది. అధికార పార్టీకి చెందిన ఎంపీ ఒకరు లోక్ సభలో పెప్పర్ స్ప్రే చేయటమా? అన్న షాక్ కు గురయ్యేలా చేశారు.

ఇదిలా ఉంటే.. విభజన నేపథ్యంలో తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయన.. తాను చెప్పినట్లే రాజకీయాల్ని సన్యసించి.. దూరంగా ఉండసాగారు. ఎప్పుడైనా ఒకసారి.. అప్పుడప్పుడు మాత్రంరాజకీయ వేదికల మీద తళుక్కున మెరిసినా.. అదంతా కూడా గెస్టు రోల్ తప్పించి.. రాజకీయాలకు దూరంగా ఉంటూ తన మాటను నిలబెట్టుకున్నారు.

ఇన్నాళ్లు వార్తల్లో లేకుండా పోయిన ఆయన ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. దీనికి కారణం ఆయన రీఎంట్రీ ఖాయమని.. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేసేది లేదని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తేల్చి చెప్పటమే కాదు.. తన కుమార్తె కూడా పోటీకి దూరంగా ఉంటామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు బదులుగా లగడపాటిని తీసుకు రావాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నా.. 2019 ఎన్నికల సమయంలో ఆయన చెప్పిన సర్వే ఫలితాలు పూర్తిగా తప్పు కావటం.. చంద్రబాబు మరోసారి అధికారంలోకి వస్తారన్నది శుద్ధ తప్పుగా తేలటమే కాదు.. జగన్ పార్టీ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. ఎంపీ స్థానానికి పోటీ చేయకుండా కేశినేని నాని ఎగ్జిట్ అవుతున్న వేళ.. ఆయన్ను టీడీపీలోకి తీసుకొచ్చి.. విజయవాడ ఎంపీ టికెట్ కట్టబెట్టాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తెర వెనుక ప్రయత్నాలు సాగుతున్నాయని.. అన్ని అనుకున్నట్లు జరిగితే.. లగడపాటి రీ ఎంట్రీ ఖాయమన్న మాట వినిపిస్తోంది. అయితే.. రాజకీయ సన్యాసం అని చెప్పి మళ్లీ రాజకీయాల్లోకి వస్తే విమర్శలు ఎదుర్కోరా? అన్న ప్రశ్న కొందరి నోట వినిపిస్తోంది. చెప్పినట్లే.. కొంతకాలం రాజకీయాల్లో దూరంగా ఉన్న తర్వాతే మళ్లీ ఎన్నికల బరిలో నిలవటం తప్పేం కాదన్న సమర్థింపు వినిపిస్తోంది. మరెలాంటి నిర్జయాన్ని లగడపాటి తీసుకుంటారో కాలమే తేల్చాలి.