Begin typing your search above and press return to search.

ఫలితాలే కాదు... లగడపాటి సర్వే కూడా లేటే

By:  Tupaki Desk   |   8 April 2019 5:11 PM GMT
ఫలితాలే కాదు... లగడపాటి సర్వే కూడా లేటే
X
ఆంధ్రా ఆక్టోపస్ గా పేరుగాంచిన కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎన్నికల వేళ నోరు విప్పితే సంచలనం కిందే లెక్క. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కు ముందుగా తనదైన శైలిలో తన అనుకూలురకు లబ్ది చేకూర్చేలా సర్వే ఫలితాలను విడుదల చేసిన ఆయన మొత్తం తన క్రెబిబిలిటీనే పొగొట్టుకున్నారన్న వాదన లేకపోలేదు. అయితే ఏపీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి అలాంటి తప్పిదాన్ని మరోమారు చేయలేనని ఇప్పటికే తేల్చేసిన లగడపాటి... ఈ దఫా పోలింగ్ పూర్తి అయిన తర్వాతనే తన సర్వే ఫలితాలను వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పుడు ఎన్నికల ఫలితాలు చాలా ఆలస్యం కానున్న సంగతి తెలిసిందే. మరో మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగియనుండగా... ఆ తర్వాత ఏకంగా నెలన్నర తర్వాత గానీ ఫలితాలు రావు. మే 23న కౌంటింగ్ జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే తన షెడ్యూల్ లో ప్రకటించిన సంగతీ తెలిసిందే. ఈ క్రమంలో ఫలితాలతో పాటు లగడపాటి సర్వే కూడా చాలా ఆలస్యంగానే వస్తుందని చెప్పాలి. సోమవారం తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లిన లగడపాటి... అక్కడ మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు.

సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ ముగిసిన తర్వాత మే 19న తన సర్వే ఫలితాలను వెల్లడిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. అంటే... ఫలితాలతో పాటు లగడపాటి సర్వే కోసం కూడా చాలా రోజుల పాటే వెయిట్ చేయాలన్న మాట. ఇక పొలిటికల్ హీట్ పెంచేసిన ఏపీ ఎన్నికల విషయంపై తన మనసులోని మాటను బయటపెట్టిన లగడపాటి.. ఈ దఫా ఏపీ ఓటర్లు అనుభవానికే పట్టం కట్టనున్నారని చెప్పారు. ఈ ఒక్క మాటతోనే జనమంతా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడునే గెలిపించనున్నారని ఆయన చెప్పేసినట్టైందన్న వాదన వినిపిస్తోంది.