Begin typing your search above and press return to search.

టీడీపీలో లగడపాటి పొలిటికల్ బిజినెస్

By:  Tupaki Desk   |   19 Oct 2015 8:51 AM GMT
టీడీపీలో లగడపాటి పొలిటికల్ బిజినెస్
X
విజయవాడ టీడీపీలో కొద్దిరోజులుగా ఓ విషయం చర్చనీయాంశంగా మారింది. తాము దశాబ్దకాలంపాటు తలపడిన ఓ ప్రత్యర్థి పాటీ నాయకుడు ఇప్పుడు టీడీపీలోకే రావడానికి తెగ ప్రయత్నాలు చేస్తుండడంతో వారంతా కంగారు పడుతున్నారట. ఆయన ఇంకెవరో కాదు... సమైక్యాంధ్ర లేనప్పుడు తాను రాజకీయాల్లో ఉండబోనంటూ రిటైర్మెంటు ప్రకటించిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. టీడీపీలో ప్రవేశం కోసం ఆయన బడా ఆఫర్లు ఇస్తున్నట్లుగా విజయవాడ టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.

అసలు లగడపాటి రాజకీయ ప్రవేశమూ ఇలాగే జరిగింది. అప్పట్లో హఠాత్తుగా విజయవాడ రాజకీయాల్లో ఎంటరై ఆ వెంటనే ఎంపీగా పోటీచేసి రెండుసార్లు వరుసగా గెలిచారాయన. ఆ తరువాత నుంచి తన యాక్టివ్ నెస్, బిజినెస్ డీలింగ్స్ తో ఆయన బాగా హైలైట్ అయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర కోసం గొంతెత్తారు. ఆ తరువాత రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించారు.

అయితే... దశాబ్దకాలంగా రాజకీయాల్లో ఉన్న మజా రుచి చూసిన ఆయన దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. రాజకీయ సన్యాసం ప్రకటించినా ఇప్పుడు తూచ్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే లాభంలేదన్న ఆలోచనకు వచ్చిన ఆయన టీడీపీతో దోస్తీకి రెడీ అవుతున్నారు. పారిశ్రామికవేత్త అయిన ఆయన ప్రతిదీ లాభానష్టాలతో బేరీజు వేస్తుంటారు.. కచ్చితమైన అంచనాలు కూడా వేస్తుంటారు. ఆయన చేసే ఎన్నికల సర్వేలు దాదాపుగా కరెక్టవుతుంటాయి. ఇప్పుడు కూడా ఆయన అన్నీ ఆలోచించుకునే, పరిస్తితులన్నీ గమనించే టీడీపీ వైపు చూస్తున్నారు.

అధికార టీడీపీలో చేరితో వచ్చే మూడున్నరేళ్లూ తాను అనుకున్నవి సాధించుకోవచ్చన్నది లగడపాటి ఆలోచనగా చెబుతున్నారు. ఇందుకోసం ఆయన ఏకంగా టీడీపీకి రూ.100 కోట్లు ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారట. పార్టీకి విరాళంగా ఈ మొత్తం ఇస్తానని ఆయన టీడీపీకి ప్రపోజ్ చేసినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ టిక్కెట్ కోసం ఆయన పట్టుపడుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో టీడీపీలో ఒక వర్గం లగడపాటి ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏదైనా అమరావతి శంకుస్థాపన తరువాత దీనిపై క్లారిటీ రానుంది.