Begin typing your search above and press return to search.

వైసీపీలోకి లగడపాటి... ముహూర్తం ఫిక్స్...?

By:  Tupaki Desk   |   24 April 2022 11:36 AM GMT
వైసీపీలోకి లగడపాటి... ముహూర్తం ఫిక్స్...?
X
ఆయన రాజకీయ సర్వేలు చేసే దిట్ట. కానీ కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని ఫట్ అయ్యాయి. అఖరుకు ఆయన తన రాజకీయ జీవితం మీద కూడా సరైన డెసిషన్ తీసుకోలేక కొన్నాళ్ళుగా అజ్ఞాత వాసంలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున రెండు సార్లు లగడపాటి రాజగోపాల్ ఎంపీగా గెలిచారు. ఆయన వైఎస్సార్ కి వీర విధేయుడిగా ఉండేవారు. ఇక వైఎస్సార్ మరణానంతరం ఆయన ఉమ్మడి ఏపీ విభజన మీద పోరాటం చేశారు. ఏపీ సమైక్యంగా ఉండాలన్నది ఆయన డిమాండ్.

అయితే మొత్తానికి ఏపీ విడిపోయింది. ఇక రాజకీయాలకు స్వస్తి అని లగడపాటి అనేశారు. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో ఏపీలో ఆయన టీడీపీ గెలుస్తుంది అని సర్వే నివేదిక ఇచ్చారు. అయితే అది కాస్తా బెడిసికొట్టడంతో ఆయన సర్వేలు మానుకున్నారు. ఇక ఆయన టీడీపీకి చంద్రబాబుకు సానుభూతిపరుడుగా ఉంటున్నారు అన్నదే ఇన్నాళ్ళుగా సాగిన ప్రచారం.

ఇక లగడపాటి పెద్ద కొడుకు ఆశ్రిత్‌ను తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా గన్నవరం నుంచి దింపుతారు అని కూడా ఈ మధ్య ప్రచారం సాగింది. అయితే ఈ ఆఫర్ మీద లగడపాటి అంతగా సుముఖంగా లేరని అంటున్నారు. ఈ నేపధ్యంలో లగడపాటి సడెన్ గా మైలవరం ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ తో కనిపించారు. ఆయనతో కలసి డైనింగ్ టేబిల్ మీటింగ్స్ నిర్వహించారు.

ఇది ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. లగడపాటి ఎందుకు వైసీపీ ఎమ్మెల్యేను కలిశారు అన్నదే చర్చ. అయితే లగడపాటి రాజకీయాల మీద కూడా అపుడే ప్రచారం మొదలైంది. ఆయన వైసీపీలో చేరుతారు అని అంటున్నారు. ఆయనకు విజయవాడ ఎంపీ సీటు ఇస్తే వైసీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారు అని అంటున్నారు.

ఇప్పటికి రెండు ఎన్నికలను వదిలేసిన లగడపాటి 2024లో కచ్చితంగా ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.మరో వైపు ఏపీలో టీడీపీ బలహీనపడింది అన్నది లగడపాటి అంచనాగా చెబుతున్నారు. దాంతో తనకు లోక్ సభ సీటు ఇస్తే కచ్చితంగా వైసీపీలో ఆయన చేరడం ఖాయమని అంటున్నారు. ఇక టీడీపీకి, విజయవాడ రాజకీయాల్లో దేవినేని ఉమా మహేశ్వరరావుకు అసలైన ప్రత్యర్ధిగా ఉంటూ వస్తున్న వసంత క్రిష్ణ ప్రసాద్ లగడపాటి ప్రతిపాదనను సీఎం జగన్ వద్దకు తీసుకెళ్తారని అంటున్నారు.

అన్నీ అనుకూలిస్తే మంచి ముహూర్తం చూసుకుని జగన్ తో లగడపాటి భేటీ అవుతారు అని కూడా అంటున్నారు. ఇక వైసీపీకి చూస్తే విజయవాడలో ఎంపీ సీటుకు గట్టి అభ్యర్ధి అంటూ లేరు. 2019 ఎన్నికల్లో పొట్లూరు వర ప్రసాద్ పోటీ చేసి ఓడాక ఫుల్ సైలెంట్ అయ్యారు. దాంతో వైసీపీకి ఈ సీటులో బలమైన అభ్యర్ధి వాంటింగ్ గా ఉంది. అదే లగడపాటి లాంటి బిగ్ షాట్ పోటీకి రెడీ అయితే ఆ పార్టీ నుంచి కూడా అభ్యంతరాలు ఏవీ ఉండబోవు అంటున్నారు. మొత్తానికి చూస్తే లగడపాటి రీ ఎంట్రీ వైసీపీతో స్టార్ట్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అన్న మాట ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.