Begin typing your search above and press return to search.

బాబుతో భేటీ!..మ్యాట‌రేంటి ల‌గ‌డ‌పాటి!

By:  Tupaki Desk   |   19 Jan 2019 8:43 AM GMT
బాబుతో భేటీ!..మ్యాట‌రేంటి ల‌గ‌డ‌పాటి!
X
ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ ప‌డుతున్న కొద్దీ ప్ర‌తి చిన్న విష‌యం కూడా పెద్ద‌ది గానే క‌నిపిస్తోంది. అంతేకాకుండా ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏ చిన్న ప‌నిచేసినా... అది చాలా పెద్ద సంచ‌ల‌నంగానే మారుతుంద‌న్న భావ‌న‌తో చోటామోటా నేత‌లు కూడా త‌మ‌దైన చిన్న వ్యూహాల‌ను ప్ర‌చారంలోకి తీసుకొచ్చేస్తుంటారు. జ‌నం కోణం నుంచి చూసినా... వార్త చిన్న‌దే అయినా - దానికి కార‌ణం చోటామోటా నేత‌నే అయినా... ఆ వార్త‌లోని అస‌లు విష‌యాన్ని అంత‌గా ప‌ట్టించుకోకుండానే... దానిపై రూమర్లుగా వ‌చ్చే విశ్లేష‌ణ‌ల‌పైనే ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు. ఇలాంటి నేప‌థ్యంలో ఆంధ్రా ఆక్టోప‌స్‌ గా పేరొందిన బెజ‌వాడ మాజీ ఎంపీ - తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్నానంటూ ప్ర‌క‌టించిన ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌... అప్పుడ‌ప్పుడూ బ‌య‌ట‌కు వ‌స్తూ మీడియా మొత్తాన్ని త‌న‌ వైపున‌కు తిప్పుకుంటున్నారు.

ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు తాను దూరంగా ఉంటున్నాన‌ని చెప్పుకుంటూనే ఆయా ఎన్నిక‌ల‌పై త‌న బృందంతో స‌ర్వేలు చేయిస్తూ సంచ‌ల‌నం రేపుతున్న ల‌గ‌డ‌పాటి... త‌న స‌ర్వేల‌కు జ‌నాల్లో వ‌చ్చిన విశ్వ‌స‌నీయ‌త‌ను మొన్న‌టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా పూర్తిగా నాశ‌నం చేసుకున్నారు. ప్ర‌జా కూట‌మి గెలుపు కోసం ఎంత చేయాలో అంతా చేయ‌డంతో పాటుగా స్థాయికి మించి అతి చేసిన ల‌గ‌డ‌పాటి అప్ప‌టిదాకా తాను సంపాదించుకున్న క్రెడిబిలిటీ మొత్తాన్ని పొగొట్టుకున్నారు. ఈ దెబ్బ‌కు మీడియా ముందుకు వ‌చ్చేందుకే ఆయ‌న జ‌డిసిపోయారు. అంతేకాకుండా తిరుమ‌ల వెంక‌న్న పాదాల సాక్షిగా తాను త‌ప్పు చేశానంటూ ఒప్పేసుకున్నారు కూడా.

అయినా ఇప్పుడు ల‌గ‌డ‌పాటి ప్ర‌స్తావ‌న ఎందుకు వ‌చ్చింద‌న్న విష‌యానికి వ‌స్తే... నిన్న ల‌గ‌డ‌పాటి నేరుగా టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడిని క‌లిశారు. బెజ‌వాడ క‌ర‌కట్ట‌పై ఉన్న సీఎం నివాసానికి వెళ్లిన ల‌గ‌డ‌పాటి చంద్ర‌బాబుతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ త‌ర్వాత ల‌గ‌డ‌పాటి మీడియాతో మాట్లాడ‌కుండానే జారుకున్నారు. ఈ నేప‌థ్యంలో అస‌లు చంద్ర‌బాబుతో ల‌గ‌డ‌పాటి భేటీకి గ‌ల కార‌ణాలు ఏమిట‌న్న విశ్లేష‌ణ‌లు మొద‌లైపోయాయి. ఏదో త‌న ఇంటిలో జ‌ర‌గ‌నున్న ఓ కార్యానికి చంద్ర‌బాబును ఆహ్వానించేందుకు ల‌గ‌డ‌పాటి వ‌చ్చి ఉంటార‌న్న కొన్ని వ‌ర్గాలు చెబుతున్నా... ఎన్నిక‌ల వేళ అంత చిన్న విష‌యం కోసం ల‌గ‌డ‌పాటి అంత దూరం వెళ్లి ఉంటారా? అని మ‌రికొన్ని వ‌ర్గాలు ప్ర‌శ్నిస్తున్నాయి. విదేశీ ప‌ర్య‌ట‌న‌ను కూడా ర‌ద్దు చేసుకున్న చంద్ర‌బాబు... రాజ‌కీయాల‌పై చ‌ర్చ‌కు కాకుండా ఇత‌ర విష‌యాల‌పై మాట్లాడేందుకు ల‌గ‌డ‌పాటికి అపాయింట్ మెంట్ ఇచ్చేంత ఛాన్స్ కూడా లేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.

అయితే... వ‌చ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ల‌గ‌డ‌పాటి పావులు క‌దుపుతున్నారా? అన్న అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాజ‌కీయాల నుంచి సన్యాసం తీసుకున్నారు క‌దా? ఎలా పోటీ చేస్తారంటారా? ఎందుకు పోటీ చేయ‌కూడ‌దు? రాజ‌కీయ నేత‌లు ఏనాడైనా మాట మీద నిల‌బ‌డ్డారా? ఇది కూడా అంతే. నాడు చేసిన ప్ర‌క‌ట‌న‌ను వెన‌క్కి తీసుకుంటున్నాన‌నో - లేదంటే అస‌లు ఆ విష‌యాన్ని ఏమాత్రం ప్ర‌స్తావించ‌కుండానే ల‌గ‌డ‌పాటి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌వ‌చ్చు. అయితే ల‌గ‌డ‌పాటి తాను పోటీ చేసే విష‌యానికి సంబంధించి కాకుండా... త‌న‌కు అనుకూల‌మైన వారికి టికెట్లు ఇప్పించుకునేందుకు బాబును క‌లిసి ఉంటార‌ని మ‌రో వాద‌న వినిపిస్తోంది. ఈ వాద‌న‌తో పాటుగా రాష్ట్రంలో టీడీపీకి విజ‌యావ‌కాశాలు ఏ మేర ఉన్నాయ‌న్న విష‌యంపై చ‌ర్చించేందుకే ల‌గ‌డ‌పాటిని చంద్ర‌బాబు పిలిచి ఉంటార‌ని మ‌రో వాద‌న వినిపిస్తోంది. ఇన్ని వాద‌న‌లు ఎన్ని వినిపిస్తున్నా.. అస‌లు విష‌య‌మైతే తెలియ‌దు గానీ.. మొత్తంగా మ‌రోమారు బ‌య‌ట‌కు వ‌చ్చి - నేరుగా చంద్ర‌బాబుతోనే భేటీ అయిన ల‌గ‌డ‌పాటి మ‌రోమారు మీడియా దృష్టిని త‌న‌వైపున‌కు తిప్పేసుకున్నార‌ని చెప్పాలి.