Begin typing your search above and press return to search.

లగడపాటి రాజకీయ సన్యాసం వెనుక కారణమిదే..

By:  Tupaki Desk   |   12 March 2019 9:29 AM GMT
లగడపాటి రాజకీయ సన్యాసం వెనుక కారణమిదే..
X
ఏపీ - తెలంగాణలో లగడపాటి రాజగోపాల్‌ పేరు మారుమోగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో సమైక్యాంధ్ర దీక్ష చేపట్టిన లగడపాటి తెలంగాణ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని వాగ్దానం చేశారు. అనుకున్నట్లుగానే ఆయన రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే అప్పుడప్పుడు సర్వేలతో ప్రజల నోళ్లల్లో నానిన లగడపాటికి గుడ్‌ సర్వేయర్‌ అని మంచి పేరు వచ్చింది. కర్ణాటకలో జరిగిన ఎన్నికల ముందు ఆయన చేపట్టిన సర్వే నిజం కావడంతో ఆయనను సర్వే మాంత్రికుడని పొగిడారు.

గత డిసెంబర్‌లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో మాత్రం లగడపాటి సర్వే బొక్కాబోర్లా పడింది. ఎన్నికలు జరగకముందు.. ఎన్నికలు జరిగిన తరువాత కూడా ఆయన కాంగ్రెస్‌ పార్టీ ఉన్న మహాకూటమి అధికారంలోకి వస్తుందని బల్లగుద్ది మరీ చెప్పారు. కానీ ఆ తరువాత ఆయన సర్వేకు ఉల్టాపల్టాగా మహాకూటమికి కనీస సీట్లు కూడా రాలేదు. దీంతో మరోసారి లగడపాటి కనిపించకుండా పోయారు. అయితే మీడియా కంటపడడంతో తెలంగాణ ఓటరు నాడి పట్టలేం అంటూ సర్దుకువచ్చారు.

తాజాగా ఆయన టీడీపీలో చేరి నరసరావుపేట నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ మంగళవారం ప్రెస్‌ మీట్‌ పెట్టిన లగడపాటి ఏ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. అంతేకాకుండా రాజకీయ సన్యాసం కొనసాగిస్తానని కూడా చెప్పారు. రాజకీయాల్లో చేరకుండా కేవలం వ్యాపారాలు మాత్రమే చేసుకుంటానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ పరిస్థితి అంతగా బాగా లేదు. టీడీపీ - వైసీపీల్లో సీట్ల గొడవ ఇంకా ముగియలేదు. ఇప్పటికే తెలంగాణలో సర్వే మూలంగా పరువు పోగొట్టుకున్న లగడపాటి ఇప్పుడు ఏ హామీలతో ప్రజల్లోకి వెళ్లాలని.. అందుకే పోటీ చేసి మరోసారి పరువు తీసుకోవడం కంటే కామ్‌ గా ఉండడం బెటరని ఆయన ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.