Begin typing your search above and press return to search.

లగడపాటి మాటే నిజం కానుందా?

By:  Tupaki Desk   |   8 Nov 2015 6:49 AM GMT
లగడపాటి మాటే నిజం కానుందా?
X
తెలుగు రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నా.. రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి రాజగోపాల్ తీరు వేరుగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉంటూ.. పార్టీకి వ్యతిరేకంగా ఎగ్జిట్ ఫలితాలు ప్రకటించటం ఆయనకే చెల్లింది. సాధారణంగా పార్టీ నేతలు తాము ప్రాతినిధ్యం వహించే పార్టీల పక్షాన నిలబడతారు. ఆ పార్టీకి గట్టి మద్దతు పలుకుతుంటారు. ఎన్నికల సమయంలోనూ.. ఫలితాల వెల్లడిలోనూ పూర్తి స్థాయి పార్టీ వాణినే వినిపిస్తుంటారు. కానీ.. లగడపాటి అందుకు భిన్నం.

ఆయన ఎన్నికలకు ముందు.. పోలింగ్ జరిగిన తర్వాత ప్రముఖ మీడియా సంస్థలకు పోటీగా తనదైన సర్వే ఫలితాల్ని విడుదల చేస్తుంటారు. ఆయన చెప్పిన జోస్యం పలుమార్లు నిజం అయ్యాయి. ఫలితాలను ముందస్తుగా వెల్లడించటం.. అవన్నీ నిజం కావటంతో లగడపాటి నోటి నుంచి ఫలితాలకు సంబంధించిన జోస్యం చెబుతున్నారంటే చాలు.. విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంటుంది. రాష్ట్ర విభజన కానీ జరిగితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన లగడపాటి.. ఆ మాటకు తగ్గట్లే రాజకీయ సన్యాసం తీసుకున్నారు.

రాజకీయ సన్యాసం అన్న వెంటనే రాజకీయాలకు పూర్తిగా దూరం కాకున్నా.. రాజకీయ కార్యకలాపాల్ని నిర్వహించే ధోరణిని తగ్గించుకున్న పరిస్థితి. తాజాగా ఆయన బీహార్ ఎన్నికల పలితాల మీద తన జోస్యాన్ని వెల్లడించారు. ఆయన మాట ప్రకారం.. బీహార్ లో విజేత లౌకిక మహాకూటమిగా చెప్పుకొచ్చారు. లగడపాటి లాంటి వ్యక్తి ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పటంతో బీజేపీ గెలుపుపై నమ్మకం పెట్టుకున్న చాలామంది సందేహంలో పడ్డారు. తాజాగా వెలువడుతున్న ఫలితాలు చూస్తే.. లగడపాటి ఎగ్జిట్ పోల్స్ కు ఉన్న విశ్వసనీయతను ఆయన మరోమారు నిలబెట్టుకున్నారని చెప్పొచ్చు.