Begin typing your search above and press return to search.

ల‌గ‌డ‌పాటి గురించి సంచ‌ల‌నాలు వెల్ల‌డిస్తా - కేటీఆర్‌

By:  Tupaki Desk   |   8 Dec 2018 1:28 PM GMT
ల‌గ‌డ‌పాటి గురించి సంచ‌ల‌నాలు వెల్ల‌డిస్తా - కేటీఆర్‌
X
తెలంగాణ‌లో హోరాహోరిగా సాగిన ప్ర‌చారం ముగిసిన అనంతరం నేతలంతా కాస్త విశ్రాంతి తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు కౌంటింగ్‌ ప‌ట్ల ఆస‌క్తిగా ఎదురుచూస్తూనే మ‌రోవైపు రాజ‌కీయ ప‌రిణామాల‌పైనా వారు ఆస‌క్తిగానే స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్‌తో పాటుగా ముగ్గురు మంత్రులు మీడియాతో మాట్లాడారు. మంత్రులు మ‌హేంద‌ర్ రెడ్డి - త‌ల‌సాని శ్రీ‌నివాస్‌ యాద‌వ్‌ - ల‌క్ష్మారెడ్డి స‌హా హైద‌రాబాద్ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తెలంగాణ భ‌వ‌న్‌ లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పాల్గొన్న తెలంగాణ ప్రజలకు టీఆర్‌ ఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ నిర్వహించినందుకు అధికారులు - పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని కేటీఆర్ అన్నారు. ఓటర్ల జాబితాలో జరిగిన పొరపాట్లు సరిదిద్దాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తామని వివరించారు. ``90 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో అద్భుతంగా పనిచేసిన లక్షలాది టీఆర్‌ ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు. ఓటర్లు పెద్దసంఖ్యలో పోలింగ్‌ కు తరలిరావడం నిశబ్ద విప్లవానికి ప్రతీక. కౌంటింగ్ ప్రక్రియ ముగిసేవరకు అందరూ అప్రమత్తంగా ఉండాలి. అనుకున్నదానికంటే పాజిటివ్‌గా పోలింగ్ సరళి ఉంది. పోలింగ్‌లో మహిళలు - వయోవృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓటింగ్ శాతం పెరగడం అభివృద్ధికి మద్దతిచ్చినట్టయింది. దాదాపు 100 సీట్లతో టీఆర్‌ ఎస్ అధికారంలోకి రాబోతోంది. ఈనెల 11న విజయోత్సవాలు జరుపుకుందాం`` అని కేటీఆర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ లో హేమాహేమీలు - సీఎం అభ్యర్థులుగా ప్రకటించుకున్న వారి కలలు కల్లలు అవుతాయని కేటీఆర్ జోస్యం చెప్పారు. ``కాంగ్రెస్ - టీడీపీ పొత్తు అపవిత్రమైన రాజకీయాలకు పరాకాష్ట. కూటమి నేతలు వందల కోట్లు ఖర్చు పెట్టారు. కూటమిని - ప్రతిపక్షాల గారడీలను ప్రజలు పట్టించుకోలేదు. ఓడిపోయేవాళ్లు కుంటిసాకులు వెతుక్కుంటారు. ఒక్కచోట కూడా రీపోలింగ్ అవసరం లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.ఈవీఎంల పనితీరుపై మాకు ఎలాంటి సందేహాలు లేవు. ఈవీఎంల విధానంలోనే కాంగ్రెస్ రెండు సార్లు గెలిచింది, మరి ఆ ఫలితాలను ఏమంటారు?`` అని ప్రశ్నించారు. చంద్రబాబుతో పొత్తు వల్ల ప్రజాకూటమికి నష్టం వాటిల్లిందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

కౌంటింగ్ జరిగే సమయంలో కార్యకర్తలు జర హుషార్ ఉండాలని కేటీఆర్ పేర్కొన్నారు. ``లగడపాటి ఏమన్నాడో ఆయనకే అర్థం కాలేదు. తెలంగాణ ఏర్పాటుతో లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఓట్ల లెక్కింపు తర్వాత లగడపాటికి సర్వేల నుంచి కూడా సన్యాసమే. మ‌రిన్ని విషయాలు 11వ తేదీన చెబుతాను`` అని కేటీఆర్ అన్నారు.