Begin typing your search above and press return to search.

దారుణంగా దెబ్బ‌తిన్న ల‌గ‌డ‌పాటి క్రెడిబులిటీ!

By:  Tupaki Desk   |   5 Dec 2018 8:21 AM GMT
దారుణంగా దెబ్బ‌తిన్న ల‌గ‌డ‌పాటి క్రెడిబులిటీ!
X
స్థానిక ఎన్నిక‌లైనా.. సార్వ‌త్రిక ఎన్నిక‌లైనా.. ఏ ఎన్నిక‌లైనా స‌రే అంద‌రి చూపూ ఆయ‌న వైపే తిరుగుతుంది. ఆయ‌న వెల్ల‌డించే స‌ర్వే ఫ‌లితాల కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. మీడియా కూడా ఆయ‌న స‌ర్వేకు బాగానే ప్రాధాన్య‌మిస్తుంది. అందుకు త‌గ్గ‌ట్లే గ‌తంలో చాలాసార్లు ఆయ‌న స‌ర్వేలు నిజ‌మ‌య్యాయి. కాస్త అటూ ఇటూగానైనా స‌రే విజేత‌ల‌ను ముందుగానే ఊహించాయి. ఈ ఉపోద్ఘాత‌మంతా ఎవ‌రి గురించో ఇప్ప‌టికే అర్థ‌మై ఉంటుంది మీకు. అవును.. ఆంధ్రా ఆక్టోబ‌స్‌గా ప్రాచుర్యం పొందిన ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ గురించే.

దేశంలో ఎక్క‌డ కీల‌క ఎన్నిక‌లు జ‌రిగినా స‌ర్వే చేయించ‌డం ల‌గ‌డ‌పాటికి అల‌వాటు. తెలంగాణ ఎన్నిక‌లపై కూడా ఆయ‌న స‌ర్వే ఫ‌లితాల కోసం అంద‌రూ ఎదురుచూశారు. అందుకు త‌గ్గ‌ట్లే తొలుత తిరుప‌తిలో త‌న సర్వే వివ‌రాల‌ను ల‌గ‌డ‌పాటి వెల్ల‌డించారు. తెలంగాణ‌లో స్వతంత్ర అభ్యర్థుల హవా నడుస్తుందని చెప్పారు. 8-10 మంది ఇండిపెండెంట్లు గెలుస్తున్నారని బాంబ్ పేల్చారు. రోజుకో ఇద్దరి పేర్లు బయటపెడతానని చెప్పి.. సమగ్ర ఫలితం మాత్రం పోలింగ్ జరిగే ఏడో తేదీనాడు చెబుతానని ప్రకటించారు.

అయితే - తాను చెప్పిన మాట‌మీద ల‌గ‌డ‌పాటి నిల‌బ‌డ‌లేదు. మొత్తం ఫ‌లితాలు ఒకేసారి ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పిన ఆయ‌న‌.. అందుకు భిన్నంగా మంగ‌ళ‌వారం ముగ్గురు రెబ‌ల్ అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తున్నార‌ని చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్ర‌జా కూట‌మికి విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌న్నారు. అయితే - ఎప్పుడూ మొత్తం స‌ర్వే వివ‌రాల‌ను పోలింగ్ త‌ర్వాత‌ బ‌య‌ట‌పెట్టే ల‌గ‌డ‌పాటి ఇప్పుడు కొంచెం కొంచెం లీక్ చేస్తుండ‌టం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

తెలంగాణ‌లో ప్ర‌స్తుత ఎన్నిక‌లు కాంగ్రెస్‌కు అత్యంత కీల‌కం. కాబ‌ట్టి వారి నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర‌వ్వ‌డం వ‌ల్లే ల‌గ‌డ‌పాటి తన స‌ర్వే వివ‌రాల‌ను తారుమారు చేసి బ‌య‌ట‌పెడుతున్న‌ట్లు క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆయ‌నపై విశ్వ‌స‌నీయ‌త పూర్తిగా దెబ్బ‌తింద‌ని కూడా చెప్తున్నారు. కూట‌మికి మొగ్గు ఉంద‌ని చెప్తూ వారి వైపున‌కు ఓట‌ర్ల మ‌ద్ద‌తును మ‌ళ్లించే ప్ర‌య‌త్నాల్లో భాగంగానే ల‌గ‌డ‌పాటి గేమ్ ఆడుతున్న‌ట్లు వారు ఆరోపిస్తున్నారు. హ‌స్తం నేత‌ల ఒత్తిడి ఆయ‌న‌పై త‌ప్ప‌కుండా ఉండే ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ల‌గ‌డ‌పాటి ఇటీవ‌ల చంద్ర‌బాబుకు కూడా ద‌గ్గ‌ర‌య్యాడు. ప‌లుమార్లు అమ‌రావ‌తిలో ఆయ‌న‌తో భేటీ అయ్యాడు కూడా. వచ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున మ‌చిలీప‌ట్నం నుంచి ల‌గ‌డ‌పాటి ఎంపీగా పోటీ చేస్తార‌నే ఊహాగానాలు కూడా ఆ మ‌ధ్య వెలువ‌డ్డాయి. ఈ ప‌రిస్థితుల్లో త‌న మిత్రుడు చంద్ర‌బాబుకు ల‌బ్ధి క‌లిగించేందుకే ఆయ‌న స‌ర్వే ఫ‌లితాల‌ను తారుమారు చేసి ఉండొచ్చ‌ని కూడా విశ్లేష‌కులు భావిస్తున్నారు.