Begin typing your search above and press return to search.

ఢిల్లీని దాటిపోయిన పాక్ లోని లాహోర్ .. ఏ విషయంలో అంటే ?

By:  Tupaki Desk   |   18 Nov 2021 8:51 AM GMT
ఢిల్లీని దాటిపోయిన పాక్ లోని లాహోర్ .. ఏ విషయంలో అంటే ?
X
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో నగరాలు వాతావరణ కాలుష్యంతో సతమతమవుతున్నాయి. పలు నగరాల్లో సాధారణ స్థాయుల కంటే అత్యధికంగా కాలుష్యం ఉంటోంది. పర్యావరణ పరిరక్షణను పట్టించుకోకుండా ఎన్నో దేశాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ అధిక మొత్తంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి.

మన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా ఉంది. అక్కడ, గాలి పీల్చుకుంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మనం ఢిల్లీ అత్యంత కాలుష్యం గల నగరమని అనుకుంటాం. కానీ, ఢిల్లీని మించిన నగరం ఒకటి ఉంది. అది ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. పాకిస్తాన్ ‎లోని లాహోర్ ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరంగా గుర్తించారు.

గాలి నాణ్యత ను పర్యవేక్షించే స్విట్జర్లాండ్ సంస్థ ఐక్యూఎయిర్ బుధవారం ఇందుకు సంబంధించి ఒక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో స్వచ్ఛమైన గాలిని కలిగి ఉన్న దేశాలు యూరప్ లోనే ఎక్కువగా ఉన్నాయి. మన దేశం విషయానికి వస్తే ఢిల్లీలో వాయు కాలుష్యం దారుణంగా ఉంది. అత్యంత కాలుష్యపూరిత నగరాల జాబితాలో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. మరోపక్క, కాలుష్యం విషయంలో ఢిల్లీ కంటే దారుణమైన స్థాయిలో పాకిస్థాన్ లోని లాహోర్ నగరం ఉంది.

ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన నగరాల జాబితాలో లాహోర్ తొలి స్థానంలో ఉంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ సంస్థ ఐక్యూఎయిర్ తెలిపింది. వాహనాలు, కర్మాగారాల నుంచి వెలువడుతున్న ప్రమాదకరమైన పొగ వలన గాలిలో కాలుష్యం దారుణంగా పెరిగిపోతోందని ఆ సంస్థ పేర్కొంది. ఈ కాలుష్యం వల్ల ప్రజల్లో శ్వాస సంబంధమైన ఇబ్బందులు పెరిగిపోతున్నాయి.

నాణ్యత లేని ఇంధనాలను మండించడం, పంట వ్యర్థాల దహనం, శీతకాల ఉష్ణోగ్రతలు మూలానా గత కొద్ది సంవత్సరాలుగా పాక్‌లో గాలి కాలుష్యం తీవ్రరూపం దాల్చుతోంది. పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన లాహోర్ నగరం కాలుష్యపరంగా చెత్త నగరాల జాబితాలో కొనసాగుతోంది.

దీంతో అక్కడి ప్రజలు సొంతంగా ఎయిర్‌ ప్యూరిఫైయర్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. కాలుష్య తీవ్రత పెరుగుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తమ పరిస్థితికి భారత్‌ కారణమని అక్కడి సర్కారు ఆరోపిస్తుంది. గాలి గాలుష్యం కారణంగా స్థానికంగా పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. కాలుష్యం వల్ల భారీగా పొగ మంచు కమ్ముకోవడంతో విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. భారతదేశ సరిహద్దుకు సమీపంలోని పంజాబ్ ప్రావిన్స్‌లోని లాహోర్‎లో 11 మిలియన్లకు పైగా జనాభా ఉంది.