Begin typing your search above and press return to search.

వైసీపీలో చేరికపై లక్ష్మీనారాయణ క్లారిటీ!

By:  Tupaki Desk   |   4 May 2020 2:30 PM GMT
వైసీపీలో చేరికపై లక్ష్మీనారాయణ క్లారిటీ!
X
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ....ఇరు తెలుగు రాష్ట్రాలకు సుపరిచతమే. గతంలో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సందర్భంగా లక్ష్మీ నారాయణ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో తన పదవికి రాజీనామా చేసిన లక్ష్మీనారాయణ...జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అయితే, జనసేనాని మళ్లీ సినిమాలు చేయాలన్న నిర్ణయం నచ్చని లక్ష్మీనారాయణ జనసేనకు రాజీనామా చేశారు. బీజేపీలో చేరేందుకు లక్ష్మీనారాయణ పావులు కదపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు, కరోనాపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు లక్ష్మీనారాయణ మద్దతు తెలపడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీలో లక్ష్మీనారాయణ చేరబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు. ప్రజల్ని, సమాజాన్ని, దేశ ఆలోచనా విధానాన్ని మార్చే రీతిలో ఎప్పుడైనా ఏదైనా రాజకీయ పార్టీ ద్వారా సాధ్యమనుకుంటే ఆ సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయం అపుడు తీసుకుంటానని లక్ష్మీనారాయణ అన్నారు. దీంతో, వైసీపీ గేట్లను లక్ష్మీనారాయణ పూర్తిగా మూసివేయలేదన్న ప్రచారం జరుగుతోంది.

తాను సీబీఐలో పనిచేసిన సమయంలో వచ్చిన కేసులను విధినిర్వహణలో భాగంగా దర్యాప్తు చేశానని.... దాదాపు 32 వరకు కేసులను తాను దర్యాప్తు చేయాల్సి వచ్చిందని లక్ష్మీనారాయణ అన్నారు. సీబీఐని వదిలేసి ఏడేళ్లు అవుతోందని.. ఆ కేసుల పురోగతి గురించి వార్తల ద్వారా మాత్రమే తాను కూడా తెలుసుకుంటూ ఉంటానని చెప్పారు. ఆ కేసుల విచారణ ఎల్లపుడూ కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఆ కేసుల పరిస్థితిపై తనకు అవగాహన లేదన్నారు లక్ష్మీనారాయణ. వైసీపీలో చేరబోతున్నారా అన్న అంశంపై లక్ష్మీనారాయణ ఆసక్తికరంగా బదులిచ్చారు. ప్రజలను, సమాజాన్ని, దేశ ఆలోచనా విధానాన్ని మార్చే విధంగా ఏదైనా రాజకీయ పార్టీ ముందుకు వస్తే...అప్పుడు దాని గురించి ఆలోచిస్తానని పరోక్షంగా చెప్పారు. రాజకీయాల్లో ఎవరి అజెండా వాళ్లకు ఉంటుందని.. ప్రజాస్వామ్యంలో ఇదంతా భాగమేనన్న లక్ష్మీనారాయణ....ఫలానా పార్టీ ఇలా ఉందని ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. జనసేనకు ఇంకొంచెం ముందుగా రాజీనామా చేసి ఉంటే బాగుండేదని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.