Begin typing your search above and press return to search.

ముంబై దాడుల మాస్టర్ మైండ్ ... లఖ్వీకి 15 ఏళ్ల జైలు శిక్ష !

By:  Tupaki Desk   |   8 Jan 2021 12:00 PM GMT
ముంబై దాడుల మాస్టర్ మైండ్ ... లఖ్వీకి 15 ఏళ్ల జైలు శిక్ష !
X
లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్, ఉగ్రదాడుల మాస్టర్ మైండ్ అయిన జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 2008వ సంవత్సరంలో ముంబైలో జరిగిన ఉగ్రదాడులకు ఇతడే ప్రధాన సూత్రధారి. ముంబై దాడుల కేసుల్లో 2015 నుంచి బెయిల్ పై ఉన్న లఖ్వీని అదుపులోకి తీసుకున్నట్టుగా పాక్ పోలీసు అధికారులు గతవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాద సంస్థలకు నిధులను సమకూరుస్తున్నాడన్న ప్రధాన కారణంతోనే అతడిని అరెస్ట్ చేసినట్టు పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజమ్ పోలీసులు తెలిపారు. ఓ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయమై లాహోర్ లోని సీడీటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. దీని ఆధారంగా స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి, ఆ సంస్థకు ఆర్థికంగా సాయం చేస్తున్న లఖ్వీని పట్టుకున్నామని పాక్ పోలీసులు వెల్లడించారు.

26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఆపరేషన్స్‌ అధిపతి జకీ ఉర్‌ రెహ్మాన్‌ లఖ్వీకి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించిందని ఆ దేశ మీడియా శుక్రవారం తెలిపింది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న ఆరోపణలపై ఆరు రోజుల కిందట లఖ్వీని పాక్‌ ఉగ్రవాద వ్యతిరేక పోలీస్‌ విభాగం గత శనివారం అరెస్టు చేసింది. 2008 ముంబై దాడుల తర్వాత ఐక్యరాజ్యసమితి లఖ్వీని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. అనంతరం లఖ్వీని పాక్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆరు సంవత్సరాల జైలు శిక్ష అనంతరం.. 2015లో రావల్పిండి జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. తిరిగి ఇటీవల లఖ్వీని అరెస్టు చేసిన క్రమంలో 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పాకిస్థాన్‌ ఉగ్రవాద నిరోధక కోర్టు తీర్పు ఇచ్చింది.

2008వ సంవత్సరం, ముంబై పౌరులే కాదు యావత్ భారత దేశ ప్రజలంతా మర్చిపోలేని చేదు అనుభవం. ఉగ్రవాద ముష్కరులు ముంబైలోని ఎనిమిది ప్రాంతాల్లో వరుస బాంబు దాడులు చేశారు. 2008 నవంబర్ 26 నుంచి నవంబర్ 29 వరకు దాదాపు నాలుగు రోజుల పాటు మారణకాండను సృష్టించారు. పది మంది వరకు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దాడులకు తెగబడ్డారు. కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చుకుంటూ పోయారు. పిల్లలను కూడా వదిలిపెట్టలేదు. ఈ దుర్ఘటనలో ఏకంగా 173 మంది చనిపోయారు. 308 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ దాడుల్లోనే ఉగ్రవాది కసబ్ పట్టుబడ్డాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతడికి భారత అత్యున్నత న్యాయస్థానం ఉరి శిక్ష విధించిన విషయం తెలిసిందే.