Begin typing your search above and press return to search.

బాబు కూడా బికాంలో ఫిజిక్స్ బ్యాచ్‌?

By:  Tupaki Desk   |   12 March 2019 11:28 AM GMT
బాబు కూడా బికాంలో ఫిజిక్స్ బ్యాచ్‌?
X
బికాంలో ఫిజిక్స్ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఈ బ్యాచ్ లో ఈ మ‌ధ్య‌నే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా చేర‌టం తెలిసిందే. త‌న ఇంట‌ర్ చ‌దువు గురించి ఇటీవ‌ల ప‌వ‌న్ అదే ప‌నిగా చెప్పిన నాటి నుంచి ఆయ‌న్ను ఆ బ్యాచ్ స‌భ్యుడిగా వేసేశారు. తాజాగా.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా అదే బ్యాచ్ అన్న ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించారు ల‌క్ష్మీపార్వ‌తి.

చంద్ర‌బాబు కూడా బీకాంలో ఫిజిక్స్ బ్యాచేనంటూ ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎంఏ త‌ర్వాత పీహెచ్ డీ చేసి ఆ త‌ర్వాత ఎంఫిల్ చేసిన‌ట్లుగా చంద్ర‌బాబు చెప్ప‌టం చూస్తే ఆయ‌న కూడా బీకాంలో ఫిజిక్స్ చేసిన‌ట్లేన‌ని ఆమె వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు కుమారుడు లోకేశ్ కూడా స్టాన్ ఫోర్డ్ వ‌ర్సిటీ నుంచి స‌ర్టిఫికేట్ కొనిచ్చారంటూ ఎద్దేవా చేశారు.

సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ వేసుకున్న ముసుగు తొలిగిపోయింద‌ని.. ఆయ‌న చంద్ర‌బాబు మ‌నిషేన‌న్న విష‌యం స్ప‌ష్ట‌మైంద‌ని ఆమె వ్యాఖ్యానించారు. జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ టీడీపీ మ‌నిషేన‌ని త‌మ పార్టీ ఎప్ప‌టి నుంచో చెబుతుంద‌ని.. తాజాగా ఆయ‌న పార్టీలో చేరిక‌తో ఆ విష‌యం క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్లేన‌ని చెప్పారు. టీడీపీలోకి మాజీ జేడీ చేర‌నున్న‌ట్లు టీడీపీ అనుకూల మీడియాలో వార్త రావ‌టం దీనికి నిద‌ర్శ‌నంగా ఆమె చెప్పారు.

రాజ‌కీయ కుట్ర‌లో భాగంగా బాబు..కాంగ్రెస్ లు కుట్ర చేసి జ‌గ‌న్ మీద అన్యాయంగా కేసులు పెట్టార‌న్నారు. సీబీఐ జేడీగా బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన ల‌క్ష్మీ నారాయ‌ణ టీడీపీ అనుకూల మీడియాతో చేతులు క‌లిపి కేసుపై లీకుల మీద లీకులు ఇస్తూ జ‌గ‌న్ పై అస‌త్య ఆరోప‌ణ‌ల‌కు కార‌ణ‌మ‌య్యార‌ని మండిప‌డ్డారు. జ‌గ‌న్ పై అస‌త్యాల్ని సృష్టించి అనుకూల మీడియాతో ప్ర‌చారానికి వాడుకున్న‌ట్లు ఆమె ఫైర్ అయ్యారు.

ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న చంద్ర‌బాబు నీచంగా దిగ‌జారిన‌ట్లుగా ఆరోపించారు. 26 కేసుల్లో స్టే తెచ్చుకొని త‌న‌కు తాను నీతిమంతుడిగా బాబు ప్ర‌చారం చేసుకోవ‌టం స‌రికాద‌న్నారు. చంద్ర‌బాబు జీవిత‌మంతా నికృష్ణ‌మేన‌ని.. నీచ‌మైన రాజ‌కీయం చేయ‌టం త‌ప్పించి రాష్ట్రానికి చేసిందేమీ లేద‌న్నారు. చంద్ర‌బాబు త‌న రాజ‌కీయ జీవితంలో జ‌ట్టు క‌ట్ట‌ని పార్టీ అంటూ లేద‌న్నారు.

ఎన్టీఆర్ హ‌యాంలో రూ.3వేల కోట్లుగా ఉన్న అప్పును రూ.60వేల కోట్ల‌కు పెంచి రుణాంధ్ర‌ప్ర‌దేశ్ గా మార్చిన ఘ‌న‌త బాబు సొంతంగా ఆమె త‌ప్పు ప‌ట్టారు. రైతుల్ని కాల్చి చంపిన చ‌రిత్ర బాబుదేన‌ని.. బాబు హ‌యాంతో పోలిస్తే వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలోనే హైద‌రాబాద్ లో ఐటీ ప‌రిశ్ర‌మ వృద్ధి చెందింద‌న్నారు. అమ‌రావ‌తిలో రాజ‌ధానికి 16 సార్లు శంకుస్థాప‌న చేసి.. వ‌ర్షానికి నీళ్లు కారే భ‌వ‌నాల్ని క‌ట్టార‌ని.. జ‌గ‌న్ అనే పేరు వినిపిస్తేనే బాబు ఉలిక్కిప‌డుతున్న‌ట్లుగా ఆమె వ్యాఖ్యానించారు.

జ‌గ‌న్ అధికారంలోకి రాగానే చంద్ర‌బాబు అక్ర‌మాల్ని బ‌య‌ట‌కు తీసి విచార‌ణ జ‌రిపిస్తామ‌న్న ల‌క్ష్మీ పార్వ‌తి . ఓట‌ర్లు త‌మ ఓట్లు ఉన్నాయో లేదో చూసుకోవాల‌న్నారు. ఓట్ల దొంగ‌లు ఉన్నార‌ని.. వారి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు.