Begin typing your search above and press return to search.

బీజేపీని డిఫెన్స్‌ లో ప‌డేసిన ల‌క్ష్మీపార్వ‌తి

By:  Tupaki Desk   |   5 Aug 2018 9:54 AM GMT
బీజేపీని డిఫెన్స్‌ లో ప‌డేసిన ల‌క్ష్మీపార్వ‌తి
X
నాలుగేళ్ల పాటు దోస్తీ కొన‌సాగించి ఇటీవ‌ల ఒకరిపై మ‌రొక‌రు దుమ్మెత్తిపోసుకుంటున్న బీజేపీ - టీడీపీ తీరు అంద‌రికీ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుది వాడుకొని వ‌దిలేసే ర‌క‌మ‌ని - ఆయ‌న పాల‌న అంతా అవినీతిమ‌య‌మ‌ని బీజేపీ ఆరోపిస్తుండ‌గా...రాష్ట్రానికి బీజేపీ చేసింది ఏమీ లేద‌ని నాలుగేళ్ల పాటు త‌మ‌ను భ్ర‌మ‌ల్లో ముంచింద‌ని టీడీపీ భ‌గ్గుమంటోంది. ఈ ఆరోప‌ణ‌లు మ‌రింత ముందుకు చేరి బాబు అక్ర‌మ‌ ఆస్తుల‌పై విచార‌ణ జ‌రిపిస్తామ‌ని బీజేపీ నేత‌లు ప్ర‌క‌టిస్తుంటే..ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలోని కేంద్ర స‌ర్కారు అవినీతిని వెలుగులోకి తెస్తామ‌ని తెలుగుదేశం పార్టీ తొడ‌కొడుతోంది. అయితే...ఈ రెండు పార్టీలు స‌వాళ్ల‌కే ప‌రిమితం అవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

ఈ ప‌రిణామంపై తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు - దివంగ‌త ఎన్టీఆర్ స‌తీమ‌ణి నంద‌మూరి లక్ష్మీపార్వతి స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ - సీఎం చంద్రబాబు - జ‌న‌సేన అధ్యక్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీరును ఆమె సూటిగా ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో న‌రేంద్ర‌మోడీ - చంద్ర‌బాబు కలిసి ఎన్నో హామీలు ఇచ్చార‌ని..అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆ ఇద్ద‌రు విభజన హామీల విషయంలో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు - ఆయన బినామీలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారనినిప్పులు చెరిగారు. చంద్రబాబు అండతో టీడీపీ నేతలు అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. పలుచోట్ల క్వారీ తవ్వకాలు అక్రమంగా జరుగుతున్నాయని - అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీజేపీ నేతలు టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న తీరు చిత్రంగా ఉంద‌ని ల‌క్ష్మీపార్వ‌తి ఎద్దేవా చేశారు.

చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమని ల‌క్ష్మీపార్వ‌తి ఆరోపించారు. అవినీతిమ‌యం అయిపోయిన చంద్ర‌బాబు స‌ర్కారుపై బీజేపీ విమ‌ర్శ‌ల్లో చిత్త‌శుద్ధి లేద‌ని మండిప‌డ్డారు. ``చంద్రబాబు ఈ ప్రాజెక్టులో ఇంత తిన్నాడు, ఆ ప్రాజెక్టులో అంత తిన్నాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మేం విచార‌ణ జ‌రిపిస్తాం అని ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. బీజేపీ నేత‌ల‌ వద్ద ఆధారాలు ఉన్నప్పుడు ఆయనపై విచారణ ఎందుకు జరిపించడం లేదు? `అని లక్ష్మీపార్వతి సూటిగా ప్రశ్నించారు. నారాయణ కాలేజీలలో ఆత్మహత్యలు చేసుకుంటున్న అమ్మాయిల గురించి విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి ఈ నాలుగేళ్ల పాటు బీజేపీ నేతలకు - జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ కు కనిపించలేదా అని ప్రశ్నించారు.