Begin typing your search above and press return to search.

యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు చాలా చిన్న విష‌యం: ల‌క్ష్మీపార్వ‌తి

By:  Tupaki Desk   |   26 Sep 2022 9:32 AM GMT
యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు చాలా చిన్న విష‌యం: ల‌క్ష్మీపార్వ‌తి
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ నంద‌మూరి కుటుంబ స‌భ్యుల‌కు బంఫ‌ర్ ఆఫ‌ర్ ఇచ్చార‌ని ల‌క్ష్మీపార్వ‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టార‌ని, ఎన్టీఆర్ హెల్త్ యూన‌వ‌ర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టార‌ని అన్నారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు కావాలా? లేక ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీకి వైఎస్సార్ పేరు కావాలా అనేది తేల్చుకోవాల‌ని జ‌గ‌న్ బంఫ‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారని ల‌క్ష్మీపార్వ‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాన‌యితే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్ట‌డాన్నే కోరుకుంటాన‌న్నారు. యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేయ‌డం అనేది చాలా చిన్న విష‌య‌మ‌న్నారు.

తాజాగా ల‌క్ష్మీపార్వ‌తి చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. విజ‌య‌వాడ‌లో 25 ఏళ్లుగా ఎన్టీఆర్ పేరుతో హెల్త్ యూనివ‌ర్సిటీ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. దాని పేరును మారుస్తూ వైఎస్సార్ ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యంగా మార్చ‌డానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు శాస‌న‌స‌భ‌, శాస‌న మండ‌లిలోనూ బిల్లును ఆమోదించింది.

జ‌గ‌న్ నిర్ణ‌యంపై ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు బాల‌కృష్ణ‌, పురందేశ్వ‌రి, మొత్తం ఎన్టీఆర్ కుటుంబం త‌ర‌పున ఎన్టీఆర్ కుమారుడు రామ‌కృష్ణ‌, హీరోలు క‌ల్యాణ్ రామ్, జూనియ‌ర్ ఎన్టీఆర్ అసంతృప్తి, ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఏపీ తెలుగు అకాడమీ చైర్‌ప‌ర్స‌న్‌గా ఉన్న ల‌క్ష్మీపార్వ‌తి సైతం జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌డ‌తార‌ని.. జ‌గ‌న్ త‌న నిర్ణ‌యాన్ని పున‌స‌మీక్షించుకోవాల‌ని కోర‌తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్న వారం త‌ర్వాత మీడియా ముందుకొచ్చిన ల‌క్ష్మీపార్వ‌తి జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థిస్తూ మాట్లాడ‌టం గ‌మ‌నార్హం.

ఎన్టీఆర్‌ను చంపిన దుర్మార్గులకు ఆయన గురించి మాట్లాడే అర్హత లేదని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో పేరు మార్పుపై ఎప్పుడూ కూడా ఆలోచించని వారు ఇప్పుడు రాద్దాంతం చేస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆమె చెప్ప‌డంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మవుతోంది. చంద్రబాబు, రాధాకృష్ణ ఓ వీడియోలో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరు తీసేయాలని మాట్లాడుకోలేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు మారిస్తే మాత్రం వీళ్లు మరోలా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఎన్టీఆర్‌ పేరు.. హెల్త్ యూనివర్సిటీకి కావాలా? జిల్లాకి కావాలా? అంటే తాను జిల్లాకే పేరు ఉండాలని కోరుకుంటాన‌ని ల‌క్ష్మీపార్వ‌తి చెప్ప‌డం గ‌మ‌నార్హం. యూనివర్సిటీ కంటే జిల్లా చాలా పెద్దద‌ని ఆమె అన‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఒక యూనివ‌ర్సిటీ రాష్ట్రం మొత్తానికి ప్రాతినిధ్యం వ‌హిస్తుంద‌నే చిన్న సంగ‌తి కూడా ఆమెకు తెలియ‌క‌పోవ‌డం బాధాక‌ర‌మంటున్నారు.

జిల్లాకు పేరు పెట్టడంలోనే వైఎస్‌ జగన్‌కు ఎన్టీఆర్‌పై ఉన్న ప్రేమ ఏంటో తెలుస్తోంద‌ని ల‌క్ష్మీపార్వ‌తి త‌న ప్రెస్ మీట్లో ప్ర‌శంస‌లు కురిపించారు. ద్వేషంతోనో, పగతోనో యూనివర్సిటీ ఎన్టీఆర్‌ పేరు మార్చలేద‌ని చెప్పారు. రూపాయి వైద్యుడిగా వైఎస్సార్ పేరు పెట్టే విషయంలో సీఎం జగన్ చెప్పిన విషయం సబబుగా ఉంద‌ని కొనియాడారు. మరో గొప్ప ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టేలా తాను సీఎం జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్తాన‌న్నారు.

ఇక్కడ ఎన్టీఆర్‌ను అగౌరవపరిచింది ఏముంది? అని ల‌క్ష్మీపార్వ‌తి ఈ విష‌యాన్ని తేలిగ్గా తీసిపారేశార‌ని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.