Begin typing your search above and press return to search.

తేడా వస్తే ఊరుకోనంటున్న లక్ష్మీపార్వతి

By:  Tupaki Desk   |   7 Feb 2017 10:58 AM GMT
తేడా వస్తే ఊరుకోనంటున్న లక్ష్మీపార్వతి
X
ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీస్తానని.. అందులో ఎన్టీఆర్ పాత్రను తానే పోషిస్తానని బాలకృష్ణ ప్రకటించిన నేపథ్యంలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తన స్పందన తెలియజేశారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీస్తానంటే, తాను ఎంతో ఆనందంతో స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఆ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను పోషించడం కుమారుడిగా బాలకృష్ణకు దక్కిన అదృష్టమని కూడా అన్నారు. అయితే.. ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరిస్తే మాత్రం సహించేది లేదని అల్టిమేటం ఇచ్చారు. ఎన్టీఆర్ జీవితంలో జరిగింది జరిగినట్టుగా తీయాలని, అలా కుదరదు అనుకుంటే, ఆయన సాధించిన విజయాలను మాత్రమే చూపించాలని బాలకృష్ణకు సలహా ఇచ్చారు.

చరిత్రను వక్రీకరించి చూపిస్తే మాత్రం తాను కోర్టుకెక్కి తీరుతానని హెచ్చరించారు. ఈ విషయంలో బాలయ్య ముందుగానే ఆలోచించుకోవాలని, చంద్రబాబును హీరోగా చూపిస్తూ, తనను దుష్టశక్తిని చేసి, తన నుంచి పార్టీని కాపాడినట్టు సినిమా తీస్తే మాత్రం సహించేది లేదని అన్నారు. ఆయన భార్యగా తానింకా బతికే ఉన్నానని, చిత్ర కథలో తేడా వస్తే ఊరుకోబోనని హెచ్చరించారు.

తాను ఇన్నేళ్లుగా ఎన్టీఆర్‌ ఆత్మ‌గౌర‌వాన్ని నిల‌బెట్టుకుంటూ వ‌స్తున్నానని, తాను ఒక్క‌రూపాయి కూడా ఆశించ‌లేద‌ని ఆమె చెప్పారు. ఎన్టీఆర్ మ‌ర‌ణం మీద విచార‌ణ జ‌రిపించాల‌ని ఆనాడు తాను అసెంబ్లీ నేత‌ల‌ని డిమాండ్ చేశాన‌ని అన్నారు. తాను సాధార‌ణ కుటుంబం నుంచి వ‌చ్చాన‌ని, మొద‌ట తాను లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేశాన‌ని, త‌న‌ను మెచ్చుకొని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నార‌ని లక్ష్మిపార్వతి చెప్పారు. వారు సినిమా తీయాల‌నుకుంటే.. 9 నెల‌ల్లో ఆయ‌న సీఎం అయిన తీరుని, తెలుగువారి ఆత్మ‌గౌర‌వాన్ని చాటిచెప్పిన తీరుని మాత్ర‌మే చూపించి శుభం వేయాల‌ని ఆమె సూచించారు. సినిమా చివ‌రి వ‌ర‌కు బాల‌య్య త‌న బావ చంద్ర‌బాబుని గొప్ప‌వాడిలా చూపిస్తారా? అని ఆమె ప్ర‌శ్నించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పుస్తకాల్లో ప్రచురించాలని ఆమె డిమాండ్ చేశారు.




Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/