Begin typing your search above and press return to search.

`వైశ్రాయ్`ఎపిసోడ్ గుట్టు విప్పిన ల‌క్ష్మీ పార్వ‌తి!

By:  Tupaki Desk   |   19 Jan 2018 10:31 AM GMT
`వైశ్రాయ్`ఎపిసోడ్ గుట్టు విప్పిన ల‌క్ష్మీ పార్వ‌తి!
X
ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` తెర‌కెక్కించ‌బోతున్నాన‌ని వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌ గోపాల్ వర్మ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ సినిమాలో వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తే స‌హించ‌బోన‌ని లక్ష్మీపార్వతి మీడియాముఖంగా తెలిపిన విష‌యం విదిత‌మే. తాజాగా, ఓ చానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా ఆమె అనేక సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. ఉమ్మ‌డి ఏపీ చ‌రిత్ర‌లో వివాదాస్ప‌ద ఘ‌ట్టంగా నిలిచిన `వైశ్రాయ్` ఎపిసోడ్ పై ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణల్లో వాస్త‌వాలు లేవ‌న్నారు. లక్ష్మీపార్వతి చెప్పారు.ఎన్టీఆర్ బ‌యోపిక్ తీయ‌బోతున్నాన‌ని వ‌ర్మ త‌న‌కు ఫోన్ చేశారని - జేడీ చక్రవర్తి కూడా త‌న‌ను క‌లిశార‌ని చెప్పారు. ఎన్టీఆర్ ను తాను ఏ ప‌రిస్థితుల్లో వివాహం చేసుకోవాల్సి వ‌చ్చిందో ఆ సినిమాలో వివ‌రిస్తాన‌ని హామీ ఇచ్చార‌ని గుర్తు చేసుకున్నారు. ఆ బ‌యోపిక్ లో కేవ‌లం ఎన్టీఆర్ వాదన మాత్ర‌మే ఉండాల‌ని - చంద్ర‌బాబు - ల‌క్ష్మీ పార్వ‌తి ల వాద‌న‌ల‌కు తావుండ‌కూడ‌ద‌నన్న అంశానికి వర్మ అంగీక‌రించార‌ని తెలిపారు.

అన్న‌గారు స్థాపించిన టీడీపీలో సంక్షోభం ఏర్ప‌డిన సమయంలో కొంద‌రు ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ వైపున్నారని లక్ష్మీపార్వతి గుర్తు చేసుకున్నారు. 1995 - జనవరి 17వ తేదీన మాజీ మంత్రి దేవినేని నెహ్రు ఓ బహిరంగ సభ ఏర్పాటు గురించే ఎన్టీఆర్ తో చర్చించార‌ని గుర్తు చేసుకున్నారు. ఆ స‌భ నిర్వ‌హ‌ణ‌కు రూ.20 లక్షల చెక్ పై ఎన్టీఆర్ సంత‌కం చేసి బ్యాంక్ ఆఫ్ బరోడాకు పంపారని - చంద్ర‌బాబు పార్టీ నిధులపై స్టే ఆర్డర్ తెప్పించి అడ్డుకున్నార‌న్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఉన్న పార్టీ అకౌంట్ ను చంద్ర‌బాబు సీజ్ చేయించడంతోనే ఎన్టీఆర్ క‌ల‌త చెందార‌న్నారు. ఈ ప‌రిణామంతో చంద్ర‌బాబుపై ఎన్టీఆర్ నిప్పులు చెరిగార‌న్నారు. చాలా సేపు చంద్ర‌బాబును తిట్టిన త‌ర్వాత తీవ్ర మనోవేదనకు గురయ్యార‌న్నారు.

తాను ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితంలో ఎపుడు జోక్యం చేసుకోలేద‌ని - ఇద్దరు అల్లుళ్ళ త‌లో దారి ఎంచుకోవ‌డంతో పార్టీలో వర్గ‌పోరు ప్రారంభ‌మైంద‌న్నారు. పార్టీ సంక్షోభం సమయంలో ....ఎమ్మెల్యేల తిరుగుబాటు - వైస్రాయ్ హోట‌ల్ ఎపిసోడ్ తర్వాత వ‌ర్షాన్ని కూడా లెక్క‌చేయ‌కుండా ఎన్టీఆర్ రాష్ట్రంలో ప‌ర్య‌టించార‌న్నారు. ప‌ర్య‌ట‌న అనంత‌రం తీవ్ర అస్వస్థతకు గురైన ఎన్టీఆర్ ను తాను ఆగ‌స్టు 30న హైద్రాబాద్ లోని మెడిసిటీ ఆసుపత్రిలో చేర్పించాన‌న్నారు. సెప్టెంబర్ 1న ఎన్టీఆర్ ఆసుపత్రిలో ఉన్నార‌ని - ఆ స‌మ‌యంలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశార‌న్నారు. ఎన్టీఆర్ కొడుకులు - ఎమ్మెల్యేలను చంద్ర‌బాబు ప్రలోభపెట్టి పార్టీని హ‌స్త‌గ‌తం చేసుకున్నార‌న్నారు. ఎన్టీఆర్ తో పెళ్లి కాకముందు ఆయ‌న జీవిత చ‌రిత్ర రాసేందుకు వారానికోసారి ఆయ‌న‌ను క‌లిసేదాన్నని చెప్పారు. హిందీ జీవిత చరిత్ర రాసేందుకు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కు - తెలుగులో త‌న‌కు అవకాశం ఇచ్చారన్నారు. 1994లో ఎన్టీఆర్ కేబినెట్ లో ఎలిమినేటి మాధవరెడ్డికి మంత్రి పదవి ద‌క్క‌క‌పోవ‌డంతో ఆయ‌న తనను కలిశారని తెలిపారు.