Begin typing your search above and press return to search.

ల‌క్ష్మీ పార్వ‌తి వార్నింగ్‌!..నాపై సినిమా తీస్తే కోర్టుకే!

By:  Tupaki Desk   |   29 Oct 2017 5:04 PM GMT
ల‌క్ష్మీ పార్వ‌తి వార్నింగ్‌!..నాపై సినిమా తీస్తే కోర్టుకే!
X

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడు - దివంగ‌త‌ నంద‌మూరి తార‌క రామారావు స‌తీమ‌ణి ల‌క్ష్మీపార్వ‌తికి ప‌ట్ట‌లేని ఆగ్ర‌హం వ‌చ్చింది. త‌న‌ను ఇబ్బంది పెట్టినా ఫ‌ర్వాలేదు కానీ - త‌న భ‌ర్త - దివంగ‌త ఎన్టీఆర్‌ ను మాత్రం కించ ప‌రిస్తే మాత్రం ఊరుకోనంటూ ఆమె నిప్పులు చెరిగారు. అంతేకాదు, ఎన్టీఆర్‌ను ఉద్దేశించి అవాకులు - చ‌వాకులు పేలితే మాత్రం కోర్టుకు సైతం ఈడుస్తాన‌ని హెచ్చ‌రించారు. ఆదివారం ప్ర‌త్యేకంగా విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడిన ల‌క్ష్మీపార్వ‌తి.. ఆసాంతం సంచ‌ల‌న కామెంట్ల‌తో ఇర‌గ‌దీశారు. మ‌రి ఆమె ఏం చెప్పారో? ఎందుకు కోప‌మొచ్చిందో? తెలుసుకుందాం ప‌దండి.

న్టీఆర్ జీవితగాథ ఆధారంగా పలువురు దర్శక నిర్మాతలు సినిమాలు తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిలో బాలకృష్ణ హీరోగా తేజ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న సినిమా ఒకటికాగా - రాంగోపాల్‌ వర్మ ప్రకటించిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ మరొకటి. ఈ మధ్యే దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి తాను ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. అటు వ‌ర్మ ప్ర‌క‌టించిన సినిమాపైనా - ఇటు కేతిరెడ్డి ప్ర‌క‌టించిన మూవీపైనా పెద్ద ఎత్తున కామెంట్లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. వ‌ర్మ మూవీలో చంద్ర‌బాబును విల‌న్‌ గా చూపిస్తార‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇక‌, కేతిరెడ్డి తీసే మూవీలో ఎన్టీఆర్‌ నే విల‌న్‌ గా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని స‌మాచారం. దీంతో ఈ మూవీపై ల‌క్ష్మీపార్వ‌తి గ‌తంలోనే స్పందించారు. అయితే, మ‌రోసారి ఆమె మీడియా ముఖంగా ఆయా సినిమాల్లో ఎన్టీఆర్‌ నుగానీ, తనను గానీ అవమానించాలనే ఉద్దేశంతో తీస్తే ఊరుకోబోనని ఘాటుగా హెచ్చరించారు.

అనుమతి తీసుకోకుండా తన జీవితంపై సినిమాలు తీస్తే కోర్టును ఆశ్రయిస్తానని అన్నారు. ప్రచారం కోసం పాకులాడుతోన్న కొందరు తనను అవమానించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని, ఎట్టిపరిస్థితుల్లోనూ వారిని అడ్డుకుంటానని చెప్పారు. ‘నన్ను ఇబ్బంది పెట్టినా భరిస్తాను. నాకు పోరాటాలు కొత్తకాదు. కానీ నా భర్త పరువుప్రతిష్టలకు భంగం వాటిల్లితేమాత్రం ఊరుకునే సమస్యేలేదు. అనుమతి తీసుకోకుండా నాపై సినిమా తీస్తే కోర్టును ఆశ్రయిస్తాను. అయితే ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంపై ఎవరు సినిమాలు తీసినా స్వాగతిస్తాను’ అని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. మ‌రి కేతిరెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏదేమైనా.. తాజా విష‌యం మ‌రోసారి సంచ‌ల‌నం సృష్టిస్తోంది.