Begin typing your search above and press return to search.

ఇదీ చంద్రబాబు: లక్ష్మీపార్వతి చెప్పిన నిజాలు

By:  Tupaki Desk   |   22 Dec 2018 2:54 PM GMT
ఇదీ చంద్రబాబు: లక్ష్మీపార్వతి చెప్పిన నిజాలు
X
నారా చంద్రబాబు నాయుడంటే... ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. చంద్రబాబు నాయుడంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడంటే ఇప్పుడు రాజకీయ చాణుక్యుడు. ఇవన్నీ ప్రస్తుతం. మరి గతం ఏమిటి? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో ఏ స్ధాయిలో చక్రం తిప్పేవారు. ఆయనకు పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు ఎలాంటి గౌరవం ఇచ్చారు. ఎలా చూశారు. ఇవన్నీ తెలుసుకోవాలంటే నందమూరి తారక రామారావు సతీమణి - చంద్రబాబు నాయుడి ఆగర్భ శత్రువు లక్ష్మీపార్వతి చెప్పిన మాటలువినాలి. కాదు... కాదు... చదవాలి. ఈమధ్య లక్ష్మీపార్వతి ఓ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడి పాత ముఖాన్ని బయటపెట్టారు. అవన్నీ చదివితే అమ్మ... చంద్రబాబూ అని ఆశ్చర్యపోవడం చదువరుల వంతు అవుతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే - అన్ ఎయిడెడ్ కళాశాలలో లక్ష్మీ పార్వతి లెక్చరర్ గా పని చేశారు. ఆ సమయంలో తమ కళాశాలను ఎయిడెడ్ గా మార్చాలని కోరేందుకు కొందరు సహచరులతో కలసి లక్ష్మీ పార్వతి హిమయత్ నగర్ లో ఉన్న తెలుగుదేశం కార్యాలయానికి వెళ్లారట.

ఆ కళాశాలను ఎయిడెడ్ కళాశాలగా మార్చాలంటే తనకు అక్షరాల ఆరు లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారట. "మా కళాశాలను ఎయిడెడ్ చేయాలంటే ఆరు లక్షలు అడిగారు చంద్రబాబు నాయుడు. అప్పుడు మా జీతం కేవలం 1500 రూపాయలు మాత్రమే" అని లక్ష్మీపార్వతి ఆ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ఈ విషయాన్ని తాను అప్పుడే ఎన్టీఆర్ కు చెప్పానన్నారు. తనకు, ఎన్టీఆర్ కు వివాహం జరగడం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదని - ఇందుకు కర్నూలులో జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమిని సాకుగా చూపారని లక్ష్మీపార్వతి అన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆనాటి విషయాన్ని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. "నేను సస్పెండ్ చేస్తే బాగుండదు. ఆయన్నే బయటకు వెళ్లిపొమ్మనండి" అని ఎన్టీఆర్ తనతో అన్నట్లు లక్ష్మీపార్వతి ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు తన దగ్గరకు వచ్చి సస్పెండ్ చేయకుండా చూడాలంటూ బతిమిలాడారని, తాను ఎన్టీఆర్ కు సర్ది చెప్పడంతో ఆయన అంగీకరించారని లక్ష్మీపార్వతి అన్నారు. ఇక చంద్రబాబు నాయుడికి ఉన్న రాజకీయ తెలివితేటలు ఆయనతోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు లేవని, కాంగ్రెస్ హయాంలో చంద్రబాబు నాయుడు మంత్రి గా పని చేసిన అనుభవం ఉన్న వారని లక్ష్మీపార్వతి అన్నారు.