Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఘనతను చెప్పిన లక్ష్మీపార్వతి

By:  Tupaki Desk   |   28 Sep 2019 11:10 AM GMT
చంద్రబాబు ఘనతను చెప్పిన లక్ష్మీపార్వతి
X
నాలుగు నెలలు కూడా నిండాకుండానే జగన్ పాలనను జడ్జ్ చేసి విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబును చెడుగుడు ఆడేశారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీపార్వతి. అసలు బాబుకు విమర్శించే హక్కు లేదని కడిగిపారేశారు. లోకేష్ బండారాన్ని కూడా బయటపెట్టేశారు. అమరావతిలో లక్ష్మీపార్వతి చేసిన కామెంట్స్ ఇప్పుడు టీడీపీ శిబిరాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి.

వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీపార్వతి చంద్రబాబుపై ఆయన కుమారుడు లోకేష్ పై హాట్ కామెంట్ చేశారు. తాజాగా అమరావతి పరిధిలోని తాడేపల్లిలో ఆమె మీడియాతో మాట్లాడారు. జగన్ పాలనపై విమర్శలు చేసే హక్కు చంద్రబాబుకు లేదని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. పీపీఏలు, అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ పేరుతో ఆరు లక్షల కోట్ల అవినీతిని చంద్రబాబు చేసి జగన్ నాలుగు నెలల పాలనపై నోరుపారేసుకుంటారా అని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగున్నర నెలల్లోనే నాలున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చి చరిత్రలో నిలిచిపోయాడన్నారు. చంద్రబాబు బురదజల్లడమే కానీ ఇలా చేశాడా.? అని మండిపడ్డారు. జగన్ పరిపాలనకు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసే బాబు జీర్ణించుకోవడం లేదని లక్ష్మీపార్వతి నిప్పులు చెరిగారు.

మాజీ మంత్రి లోకేష్ ను లక్ష్మీపార్వతి కడిగేశారు. ‘ట్విట్టర్ లో మాత్రమే మాట్లాడే కొడుకును కన్న ఘనత చంద్రబాబుదేనని’ లక్ష్మీపార్వతి హాట్ కామెంట్ చేశారు. ఏనాడు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం నారా లోకేష్ చేయలేదని దుయ్యబట్టారు.

40ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు గడిచిన ఐదేళ్ల పాలనలో ఏమీ చేయలేదని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. కమీషన్ల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. జగన్ నాలుగు నెలల పాలనపై ఎలాంటి రీమార్క్ లేదని.. గాంధీజీ చెప్పిన గ్రామస్వరాజ్యం వైపు జగన్ అడుగులు వేశారని.. గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారని లక్ష్మీపార్వతి కొనియాడారు.

జగన్ ను ఇబ్బందులు పెట్టడానికి చంద్రబాబు, ఎల్లో మీడియా కుట్ర పన్నాయని లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు.ఎల్లో మీడియాతో మహిళనైనా తనను అసెంబ్లీ ఎన్నికల ముందర ఇబ్బందులు పెట్టారని.. తీవ్ర ఆరోపణలు చేయించారని లక్ష్మీపార్వతి ఫైర్ అయ్యారు. చివరకు మాజీ స్పీకర్ కోడెల మరణాన్ని కూడా చంద్రబాబు శవరాజకీయం చేశారని మండిపడ్డారు.