Begin typing your search above and press return to search.

ల‌క్ష్మీపార్వ‌తి ఫైర్‌: బాబుది దుష్ట సంస్కృతి

By:  Tupaki Desk   |   31 Oct 2017 10:34 AM GMT
ల‌క్ష్మీపార్వ‌తి ఫైర్‌:  బాబుది దుష్ట సంస్కృతి
X
ఏపీ సీఎం చంద్ర‌బాబుపై నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి ఓ రేంజ్‌ లో ఫైర‌య్యారు. బాబుది దుష్ట సంస్కృతి అని - దానిని రాష్ట్రం మొత్తం అమ‌లు చేస్తున్నాడ‌ని విమ‌ర్శించారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో అస‌లైన టీడీపీ లేద‌ని - పోనీ బాబు టీడీపీ ఉందా? అంటే అదీ లేద‌ని - దానిని కార్పొరేట్ శ‌క్తుల‌కు అమ్మేశాడ‌ని ల‌క్ష్మీపార్వ‌తి విరుచుకుప‌డ్డారు. ఏపీ పోలీసులు చంద్ర‌బాబుకు చెంచాల్లా మారార‌ని దుయ్య‌బ‌ట్టారు. విశాఖ‌లో నిర్వ‌హిస్తున్న మ‌గువ‌ల అందాల పోటీల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌ధాన విప‌క్షం వైసీపీ ఆధ్వ‌ర్యంలో విశాఖ‌లో మంగ‌ళ‌వారం పెద్ద ఎత్తున ధ‌ర్నా నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ల‌క్ష్మీపార్వ‌తి.. చంద్ర‌బాబు స‌ర్కారుపై దుమ్మెత్తిపోశారు. అధికార పార్టీకి పోలీస్ వ్యవస్థ చెంచాలా పనిచేస్తోందని - మహిళలపై దాడులను అరికట్టడంలో విఫలమ‌య్యార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విశాఖలో భూకబ్జాలు - రౌడీయిజం రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. భూముల కబ్జాపై తూతూ మంత్రంగా కమిటీ వేశారని, ఈ వ్యవహారంలో దర్యాప్తును గాలికి వదిలేశారని దుయ్య‌బ‌ట్టారు. దివంగ‌త మ‌హాన‌టుడు ఎన్టీఆర్‌ ను వెన్నుపోటు పొడిచిన చంద్ర‌బాబు టీడీపీని హస్తగతం చేసుకున్నాడ‌ని అన్నారు. ఇప్పుడు ఆ పార్టీని భ్రష్టుపట్టించారని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

కబ్జా రాజకీయాలు - బ‌హిరంగ‌ మానభంగాలు ఇదా ప్రభుత్వ విధానమని ప్రశ్నించారు. టీడీపీని కార్పొరేట్‌ వ్యక్తులకు అమ్మేశారని ఆరోపించారు. ఆ శ‌క్తుల చెప్పుచేత‌ల్లోనే బాబు న‌డుస్తున్నాడ‌ని అన్నారు. అందాల పోటీకి వ్యతిరేకంగా ఆందోళన చేపడితే మహిళలను దారుణంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహించేందుకు విఫలయత్నం చేశారని గుర్తు చేశారు. ఎందుకు ఈ దుష్ట సంస్కృతిని ప్రవేశపడుతున్నారని, దీన్నిబట్టే చంద్రబాబు ఎలాంటివాడో అర్థమవుతోందని అన్నారు. మొత్తానికి ఎప్పుడు ఎక్క‌డ ఎలాంటి అవ‌కాశం చిక్కినా ల‌క్ష్మీపార్వ‌తి బాబును ఏకేస్తుండ‌డం విశేషం అంటున్నారు వైసీపీ నేత‌లు.